ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్‌ వాహనాలు..! | E-Highway Will Be Implement Soon In India - Sakshi
Sakshi News home page

ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

Published Sat, Dec 30 2023 12:40 PM

Electric Highway Will Be Implement Soon In India - Sakshi

ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. దాంతో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కరెంట్‌తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి పెద్దమొత్తంలో కరెంట్‌ అవసరం అవుతోంది.

మధ్యలో ఛార్జింగ్‌ అయిపోయినా లేదా ఛార్జింగ్‌ కోసం ఎక్కడైనా ఆగినా సమయం వృథా అవుతుంది. కాబట్టి విద్యుత్‌తో నడిచే భారీ ట్రక్కులపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపడంలేదు. కానీ అలాంటి వారితోపాటు తరచూ సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ హైవేలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 

ఈ నేపథ్యంలో విదేశీ తరహాలో దేశంలో మొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. ఇకపై హైవేలో వెళ్లే భారీ వాహనాలు పవర్ ద్వారా నడవనున్నాయి. రైళ్లు, మెట్రో ట్రెయిన్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. గతంలో ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీ మొదటిసారి ఉపయోగించింది. ఇందులో భాగంగా హైవేపై వెళ్లే ట్రక్కుల పైభాగంలో రైళ్ల మాదిరి కరెంట్‌ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. దాని నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి విద్యుత్‌ సరఫరా అవుతుంది. అవి రీచార్జ్‌ అవుతూ ట్రక్కు ముందుకుసాగుతుంది. హైవే నుంచి డైవర్షన్‌ తీసుకున్న తర్వాత ఎలాగూ అప్పటికే బ్యాటరీలు ఛార్జ్‌ అవుతాయి కాబట్టి అందులోని విద్యుత్‌ను వినియోగించుకుని వాహనం కదులుతుంది. ఈ టెక్నాలజీతో మార్గం మధ్యలో మళ్లీ ఛార్జింగ్‌ చేసుకోకుండా వాహనం కదులుతున్నప్పుడే చార్జ్‌ అయ్యే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?

సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు. దిల్లీ-జైపుర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవేను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్‌, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. రహదారిపై ఏర్పాటు చేసిన పవర్‌ కేబుళ్ల విద్యుత్‌ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయన్నారు.

Advertisement
Advertisement