Elon Musk: ఇంకా డ్రగ్స్‌ వాడుతున్నాడా.. వికృత ప్రవర్తనకు కారణం అదేనా? | Sakshi
Sakshi News home page

Elon Musk: ఇంకా డ్రగ్స్‌ వాడుతున్నాడా.. వికృత ప్రవర్తనకు కారణం అదేనా?

Published Sun, Jan 7 2024 4:28 PM

Elon Musk Used LSD Cocaine Report - Sakshi

ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి కెటామైన్ వంటి సైకెడెలిక్ డ్రగ్స్ వాడటం గత ఏడాది వార్తల్లో నిలిచింది. అయితే మస్క్‌ ఇప్పటికీ డ్రగ్స్‌ వాడుతున్నారని, ఇది ఆయన ఆరోగ్యంతోపాటు మస్క్‌ పర్యవేక్షిస్తున్న విస్తారమైన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోని పలువురు బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ సంచలన నివేదిక ప్రచురించింది.

ప్రపంచంలోని పలు చోట్ల జరిగిన ప్రైవేట్ పార్టీలలో ఎలాన్‌ మస్క్‌ ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎక్స్‌టాసీ, సైకెడెలిక్ మష్రూమ్‌లను తీసుకునేవాడని దగ్గర నుంచి గమనించిన కొందరు చెబుతున్నారు.  సైకెడెలిక్ లాంటి డ్రగ్ కెటామైన్ కోసం తాను ప్రిస్క్రిప్షన్ కలిగి ఉన్నట్లు గతంలో స్వయంగా చెప్పిన మస్క్‌.. బహిరంగంగానే గంజాయిని సేవించిన విషయం తెలిసిందే.

వరుస సంఘటనలు
2018లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన పార్టీలో ఎలాన్‌ మస్క్‌ చాలా యాసిడ్ టాబ్లెట్లను తీసుకున్నాడు. మరుసటి సంవత్సరం మెక్సికోలో జరిగిన ఒక పార్టీలోనూ మ్యాజిక్ పుట్టగొడుగులను సేవించాడు.  ఇక 2021లో మియామిలోని ఆర్ట్ బాసెల్ హౌస్ పార్టీకి హాజరైనప్పుడు ఎలాన్‌ మస్క్‌, అతని సోదరుడు కింబాల్ మస్క్ ఇద్దరూ కెటామైన్ సేవిస్తూ కనిపించారు. గతంలో టెస్లా, ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్టీవ్ జుర్వెట్‌సన్‌తో కలిసి ఎలాన్‌ మస్క్‌ మాదకద్రవ్యాలు సేవించినట్లు తెలుస్తోంది.

నివేదిక ప్రకారం, టెస్లాలో మాజీ డైరెక్టర్ అయిన లిండా జాన్సన్ రైస్..  ఎలాన్‌ మస్క్‌ వికృత ప్రవర్తన, అతని మాదకద్రవ్యాల వాడకంతో చాలా ఆగ్రహానికి గురైంది. ఆమె 2019లో కంపెనీ బోర్డులోకి మళ్లీ రాకూడదని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మస్క్ అటార్నీ అయిన అలెక్స్ స్పిరో ఖండించారు. స్పేస్‌ ఎక్స్‌లో మస్క్‌ ఎప్పటికప్పుడు డ్రగ్స్‌ పరీక్షలను ఎదుర్కొంటాడని, వీటిలో ఎప్పుడూ విఫలం కాలేదని చెప్పారు. 

స్పేస్‌ఎక్స్‌ ఈవెంట్‌లో బూతులు
ఇక మరొక సంఘటనలో 2017లో కంపెనీ ఈవెంట్‌లో కొంతమంది స్పేస్‌ఎక్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు మస్క్‌ ప్రవర్తనలో మార్పును గమనించారు. కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద మిషన్ కంట్రోల్ చుట్టూ వందలాది మంది ఉద్యోగులు చేరారు. దాదాపు గంట ఆలస్యంగా వచ్చిన మస్క్‌.. మత్తులో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు.2018లో జో రోగన్ షోలో గంజాయిని సేవిస్తూ కనిపించిన మస్క్ తర్వాత నాసాతో ఇబ్బందుల్లో పడ్డాడు. ఇది కంపెనీపై ప్రభావం చూపించింది. స్పేస్‌ఎక్స్‌లోని సిబ్బంది అంతటికి ఔషధ పరీక్షలకు దారితీసింది. 

చాలా మంది టెస్లా బోర్డు సభ్యులు మస్క్‌ మాదకద్రవ్యాల వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మిటింగ్‌ మినిట్స్‌ లేదా బోర్డు అధికారిక ఎజెండాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ టెస్లా బోర్డు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న రాబిన్ డెన్‌హోమ్ వంటి కొంతమంది డైరెక్టర్‌లు డ్రగ్స్  అనే పదాన్ని ఉపయోగించకుండా మస్క్ ప్రవర్తనపై 2022 ప్రారంభం వరకు టెస్లా, స్పేస్‌ఎక్స్ రెండింటిలో బోర్డు సభ్యుడైన కింబాల్ మస్క్‌ని సంప్రదించారు.

చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఇష్టం లేదట!
టెస్లాను ప్రైవేట్‌గా మార్చే ప్రణాళికల గురించి 2018లో చేసిన ట్వీట్‌తో సహా మస్క్ అసాధారణ ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుందని ఎగ్జిక్యూటివ్‌లు తలలు పట్టుకున్నారు. దీనికి  మాదకద్రవ్యాల వాడకమే కారణమని కొందరు, దీర్ఘకాలిక నిద్రలేమి మరికొందరు అభిప్రాయపడ్డారు. ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్రపై రచయిత వాల్టర్ ఐజాక్సన్ ఇటీవల ప్రచురించిన పుస్తకంలోనూ మస్క్‌ "డెమోన్ మోడ్"ని వివరించారు. ఎలాన్ మస్క్ తరచుగా నిగ్రహాన్ని కోల్పోతాడని, ఉద్యోగులపై విరుచుకుపడతాడని పేర్కొన్నారు. అయితే చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వాడటం తనకు ఇష్టం లేదని మస్క్‌ పేర్కొన్నట్లుగా ఈ పుస్తకంలో ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement