ఇక బడ్జెట్‌పైనే ఆశలు..! | Sakshi
Sakshi News home page

2022–23 కేంద్ర బడ్జెట్‌కి వేళాయే !

Published Mon, Jan 31 2022 12:28 PM

Expert opinion On Union Budget Impact On Stock Market - Sakshi

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రేపు (మంగళవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌–2022–23కు అనుగుణంగానే ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే రోజున జనవరి నెల వాహన విక్రయ, జీఎస్‌టీ, తయారీ రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ కీలకాంశాలూ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్‌ కదలికలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. ‘‘ప్రస్తుతం నిఫ్టీకి 16,850 వద్ద బలమైన మద్దతు స్థాయి ఉంది. అమ్మకాలు కొనసాగితే 16,000 వద్ద మరో కీలక మద్దతు ఉంది. షార్ట్‌ కవరింగ్‌ జరిగితే అప్‌ట్రెండ్‌లో 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. నాలుగు రోజులే ట్రేడింగ్‌ జరిగిన గతవారంలో సెన్సెక్స్‌ 1,837 పాయింట్లు, నిఫ్టీ 515 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

మార్కెట్‌పై బడ్జెట్‌ ప్రభావెంత..? 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022 ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ 2022–23ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వేళ కేంద్ర బడ్జెట్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు సరైన దిశానిర్ధేశం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ ‘‘స్థిరత్వంతో కూడిన వృద్ధి’’ అజెండాకు ప్రాధాన్యతనివచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుకు సంబంధించి ఉపశమనం లభించవచ్చని ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఈ పన్నును మినహాయిస్తే స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకోవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు, ఇంధన పన్నులపై కోత ఆశలు ఊరిస్తున్నాయి. బడ్జెట్‌ మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు తిరిగి ర్యాలీ చేయవచ్చు. ప్రతికూలంగా ఉంటే అమ్మకాలు పెరగవచ్చు. 

భయపెడుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు 
రష్యా– ఉక్రెయిన్‌ దేశాల మధ్య తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలతో ఇటీవల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇరుదేశాల మధ్య వివాదం జఠిలం కావడంతో ముడిచమురు సరఫరాకు తీవ్ర ఆటంకం తలెత్తింది. దీంతో గతవారంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌  ధర ఎనిమిదేళ్ల తర్వాత 90 డాలర్లకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన మనదేశంపై ద్రవ్యలోటు దవ్యోల్బణ భారాలు మరింత పెరగొచ్చు

క్యూ 3 ఫలితాలు
కీలక దశకు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, ఐఓసీ, అదానీ పోర్ట్స్, టెక్‌ మహీంద్రా, జిందాల్‌ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఐటీసీ, అదానీ ట్రాన్స్‌పోర్ట్స్, గెయిల్, లుపిన్, టాటా స్టీల్, దివీస్‌ ల్యాబ్స్, శ్రీ సిమెంట్స్‌ సహా ఈ వారంలో మొత్తం 500 కంపెనీలు తమ డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు.  స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.    

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం 
గతేడాది డిసెంబర్‌ నెలకు సంబంధించిన మౌలిక రంగ, కరెంట్‌ అకౌంట్‌ లోటు గణాంకాలు 2022 జనవరి 31న విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో పాటు ఆటో కంపెనీల జనవరి వాహన విక్రయ గణంకాలు వెలువడతాయి. అదేరోజున తయారీ పీఎంఐ గణాంకాలు జనవరి జీఎస్‌టీ వసూళ్లు వెల్లడి కానున్నాయి. సేవారంగ పీఎంఐ డేటా గురువారం విడుదల అవుతుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు.   

నాలుగో నెలా అమ్మకాలే ...  
ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 3– 29 తేదీల మధ్య రూ. 28,243 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. ఫలితంగా వరుసగా నాలుగో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అధికంగా అమ్మకాలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపు విదేశీ, దేశీ ఇన్వెస్టర్లకు సరైన దిశానిర్దేశం చేస్తుందని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు. 

చదవండి: ప్రీ బడ్జెట్‌ డిమాండ్‌.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాల్సిందే..

Advertisement
Advertisement