ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి | Sakshi
Sakshi News home page

ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి

Published Mon, Feb 12 2024 6:25 AM

Focus on IIP and inflation data Says Stock Experts - Sakshi

ముంబై: కార్పొరేట్‌ డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలు కదలికలపై మార్కెట్‌ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు.

ఫెడరల్‌ రిజర్వ్, ఆర్‌బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  
‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్‌ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్‌ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్‌ట్రెండ్‌ మూమెంటమ్‌ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు రూపక్‌ దే తెలిపారు.

నేడు రిటైల్‌ ద్రవ్యోల్బణం డేటా  
నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్‌ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్‌  పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్‌ హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్‌ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది.  

చివరి దశకు క్యూ3 ఫలితాలు
దేశీయ కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఐషర్‌ మోటార్స్, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్, మజగాన్‌ డాక్‌ షిప్‌యార్డ్స్, ఫోనిక్స్‌ మిల్స్‌తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్‌ రసాయన్, కోల్‌ ఇండియా, సెయిల్, సంర్ధన్‌ మదర్‌సన్, హిందాల్కో, ఐఆర్‌సీటీసీ, భెల్, గ్లాండ్‌ ఫార్మా, ముత్తూట్‌ ఫైన్సాన్‌లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.   

4 లిస్టింగులు, 2 పబ్లిక్‌ ఇష్యూలు  
ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్‌ కానున్నాయి. ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, క్యాపిటల్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్‌ కానున్నాయి. వి¿ోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ ఐపీఓ గురువారం ముగియనుంది.  

డెట్‌ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు  
డెట్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్‌ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్‌ ఇండెక్స్‌లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు  కారణాలని నిపుణులు చెబుతున్నారు.  ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్‌ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్‌ మార్కెట్లలో భిన్న ట్రెండ్‌ దారితీసింది’’ అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement