ఫారెక్స్‌ నిల్వలు పుష్కలం పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోగలం

28 Sep, 2022 13:15 IST|Sakshi

ప్రస్తుత ప

న్యూఢిల్లీ: విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయంటూ నెలకొన్న ఆందోళనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్‌ సేథ్‌ తోసిపుచ్చారు. దీన్ని ‘మరీ ఎక్కువగా‘ చేసి చూపుతున్నారని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ దగ్గర పుష్కలంగా ఫారెక్స్‌ నిల్వలు ఉన్నాయని సేఠ్‌ చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం తగ్గడం, వాణిజ్య లోటు అధికంగా ఉండటం వల్ల మారక నిల్వలు తగ్గాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయన చెప్పారు.

వరుసగా ఏడో వారం ఫారెక్స్‌ నిల్వలు తగ్గిన నేపథ్యంలో సేథ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబర్‌ 16తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 2.23 బిలియన్‌ డాలర్లు తగ్గి 545.65 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81ని కూడా దాటేసి ఆల్‌టైం కనిష్టానికి పడింది. మరోవైపు, దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, అంతర్జాతీయంగా డాలరు బలపడుతుండటమే రూపాయి క్షీణతకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు