Sakshi News home page

విలాసాల కోసం గ్యాంబ్లింగ్‌.. చివరకు ఏమైందంటే..

Published Wed, Mar 13 2024 9:16 AM

Former Employee Sentenced To 6 Years For Stealing Rs180 Crs - Sakshi

కాయ్‌ రాజా కాయ్‌.. వంద పెట్టండి... వెయ్యి పట్టండి వంటి ప్రకటనలతో ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌లు, మనీసర్క్యులేషన్‌ వంటి చెడు మార్గాలకు యువత బానిసవుతున్నారు. విలాసాలకు అలవాటుపడిన వారు తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తీరా నేరం రుజువై జైలుపాలవుతున్నారు.

ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తాజాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దాదాపు రూ.180 కోట్లమేర మోసానికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్‌ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి నేరం రుజువై ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. అమిత్‌పటేల్‌ అనే ఉద్యోగి అమెరికాలోని జాక్సన్‌విల్లే జాగ్వార్‌ కంపెనీలో ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. కంపెనీ, ఉద్యోగులు తాత్కాలిక ఖర్చుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ (వీసీసీ)ని ఉపయోగించేలా అతడికి అవకాశం ఉండేది. వీసీసీను చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులకోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే అతడు వ్యక్తిగతంగా చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు వంటి వాటికి వీసీసీను వినియోగించేవాడు. ఈ లావాదేవీలను కంపెనీ తరఫు ఖర్చులుగా చిత్రీకరించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. చాలాసార్లు ప్రయాణాలు చేయకపోయినా నకిలీ ధ్రువపత్రాల ద్వారా కంపెనీని మోసం చేశాడు. అవి ముందుగా  నమ్మదగినవిగానే అనిపించినా క్రమంగా కంపెనీ యాజమాన్యానికి అనుమానం వ్యక్తం అయింది. 

పటేల్ వీసీసీ ద్వారా అక్షరాల 21.1 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.180 కోట్లు) ఖర్చు చేశాడు. ఈ డబ్బును ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయడానికి, ఆన్‌లైన్‌లో జూదం ఆడటానికి, ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకోవడానికి, స్నేహితుల కోసం లగ్జరీ ట్రిప్‌ల కోసం ఉపయోగించాడు. ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో విల్లా, కొత్త టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ ట్రక్‌ కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా కంపెనీ విచారణ జరిపి పోలీసులను ఆశ్రయించింది. 

ఇదీ చదవండి: ‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’

ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన పోలీసులు కేసును కోర్టుకు తరలించారు. పూర్వాపరాలు, ఆధారాలు తెలుసుకున్న కోర్టు మంగళవారం అమిత్‌పట్‌ల్‌కు ఏకంగా ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ఏడాది ముందు తానెంతో తెలివిగల వాడినని భావించినట్లు చెప్పాడు. కానీ జూదం, గ్యాంబ్లింగ్‌ వల్ల చాలా నష్టపోయానని అన్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులపాత్ర లేదని కోర్డు నిర్ధారించింది. చివరకు కంపెనీ పటేల్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.

Advertisement
Advertisement