అదానీకి మరో షాక్‌.. ఒకదాని తర్వాత మరొకటి, 3 రోజుల్లోనే

31 Jan, 2023 12:19 IST|Sakshi

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీకి మరో షాక్‌ తగిలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన సంపద రోజు రోజుకూ పతనం వైపు పరుగులు పెడుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన ర్యాంకింగ్ మరింత కిందకి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని టాప్‌ 10 సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు.

టాప్‌ 10లో స్థానం పాయే 
హిండెన్‌బర్గ్‌ నివేదికతో గౌతమ్‌ అదానీ సంపద చూస్తుండగానే మంచులా కరిగిపోతుంది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక  ప్రకారం.. అదానీ సంపద 3 రోజుల్లోనే 34 బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్‌ డాలర్ల సంపదతో 11వ  స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ రాకముందు ఆయన మూడో స్థానంలో ఉండేవారు. భారత్‌ నుంచి టాప్‌ 10 చోటు దక్కించుకున్న సంపన్నుడిగా కొన్నాళ్లు కొనసాగారు.

అదానీ గ్రూప్ మూడు రోజుల్లో 72 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌ను కోల్పోయింది. ఆయన వ్యాపారం, స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్‌, రుణ భారంపై అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ బ‌య‌ట‌పెట్టిన నివేదిక ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌ను బ‌ల‌హీన ప‌రిచింది. ఈ ఆరోపణలు నిరాధారమని అదానీ 413 పేజీల వివ‌ర‌ణ నివేదిక కూడా ఇన్వెస్ట‌ర్ల‌లో విశ్వాసం నింప‌లేక‌పోయింది. ఈ దెబ్బకు ఆ సంస్థ కీల‌క డాల‌ర్ బాండ్లు కూడా తాజా క‌నిష్ట స్థాయిని తాకాయి.

చదవండి: రానున్న బడ్జెట్‌ సెషన్‌లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?

మరిన్ని వార్తలు