5జీకి భారత్‌ సారథ్యం

16 Mar, 2023 06:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి సాధనలో ఏ దేశానికైనా పటిష్టమైన డిజిటల్‌ వ్యవస్థ అత్యంత కీలకంగా ఉంటోందని అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలు తెలిపారు. ఇందుకు ఊతమిచ్చే 5జీ సేవల విస్తరణ విషయంలో మిగతా దేశాలకు భారత్‌ సారథ్యం వహించగలదని వారు అభిప్రాయపడ్డారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా వారు ఈ విషయాలు తెలిపారు. భారత్‌ ఒక క్రమపద్ధతిలో డిజిటల్‌ వ్యవస్థను రూపొందించుకుంటోందని నోకియా కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ పెకా లుండ్‌మార్క్‌ తెలిపారు.

భారత్‌ తమకు ఇప్పుడు రెండో అతి పెద్ద మార్కెట్‌ అని, ఇక్కడి నుంచి 5జీ బేస్‌ స్టేషన్లను తాము ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాలో ఫేస్‌బుక్, టెన్సెంట్‌ వంటి డిజిటల్‌ కంపెనీల అభివృద్ధిలో 4జీ కీలకపాత్ర పోషించిందని ఎరిక్సన్‌ ప్రెసిడెంట్‌ బోర్జే ఎకోమ్‌ తెలిపారు. దేశీయంగా 5జీ సేవల వేగవంతమైన విస్తరణతో భారత్‌లో అత్యంత ఆధునిక డిజిటల్‌ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ చౌకగా లభించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నోకియా, ఎరిక్సన్‌ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. లేకపోతే గ్రామీణ ప్రజానీకం, అంతర్జాతీయ ఎకానమీని డిజిటల్‌గా అనుసంధానం చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు.

100 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు ..
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌ దేశాల్లో ఒకటిగా భారత్‌ ఉంటోందని జనరల్‌ అట్లాంటిక్‌ (ఇండియా) ఎండీ సందీప్‌ నాయక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో భారత్‌లోకి 100 బిలియన్‌ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోకి వెల్లువెత్తుతున్న ప్రైవేట్‌ పెట్టుబడులను బట్టి చూస్తే ఇవి ఒక మోస్తరు అంచనాలు మాత్రమేనని నాయక్‌ వివరించారు.

మొబైల్స్‌ భద్రత కోసం కొత్త నిబంధనలు
పరిశ్రమ వర్గాలతో కేంద్రం సంప్రదింపులు
యూజర్ల డేటా దుర్వినియోగం, ప్రీ–ఇన్‌స్టాల్డ్‌ నిఘా యాప్‌లపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనల  రూపకల్పనపై పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఒక ట్వీట్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్‌ సరఫరా వ్యవస్థలో భారత్‌ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్లు, యాప్‌ల భద్రత చాలా కీలకంగా ఉండబోతోంది. అందుకే తగు స్థాయిలో భద్రతా ప్రమాణాలను రూపొందించేందుకు పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది‘ అని పేర్కొంది. మరోవైపు, డేటా దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో తాము కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నామని మొబైల్‌ ఫోన్స్‌ తయారీ సంస్థలు తెలిపాయి. అయితే, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడితే కొత్త హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టడంలో జాప్యం జరుగుతుందని, అలాగే ప్రీ–ఇన్‌స్టాల్డ్‌ (ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసిన) యాప్స్‌ ద్వారా వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు