కుప్పకూలిన పసిడి, వెండి ధరలు | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన పసిడి, వెండి ధరలు

Published Sat, Nov 28 2020 9:56 AM

Gold, Silver prices tumbles in MCX and New york Comex - Sakshi

న్యూయార్క్/ ముంబై: వారాంతాన విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. యూఎస్‌లో థ్యాంక్స్‌ గివింగ్‌ సెలవుల నేపథ్యంలో డాలరు ఇండెక్స్‌ బలహీనపడగా.. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ సైతం నీరసించాయి. అయినప్పటికీ పసిడి ధరలు పతనంకావడం గమనార్హం! దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో వరుసగా ఐదో రోజు పసిడి ధరలు డీలాపడ్డాయి. ఇటీవల కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగిన బంగారం ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యమిస్తున్నట్లు బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

అమెరికా కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్‌ పదవిని చేపట్టనుండటంతో  రాజకీయ అనిశ్చితికి తెరపడనున్నట్లు తెలియజేశారు. దీనికితోడు కోవిడ్‌-19 కట్టడికి ఫైజర్‌, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు వ్యాక్సిన్లు వెలువడనున్న వార్తలు సైతం ట్రేడర్లపై ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. కాగా.. శుక్రవారం తలెత్తిన భారీ అమ్మకాల నేపథ్యంలో న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి బలహీనంగా కనిపిస్తున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో జులైలో నమోదైన కనిష్టం 1,756 డాలర్ల వద్ద పసిడికి సపోర్ట్‌ లభించవచ్చని అంచనా వేశారు. ఇదేవిధంగా 1,842 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

నష్టాలతో
ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 411 క్షీణించి రూ. 48,106 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,647 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,800 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 773 నష్టపోయి రూ. 59,100 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 59,950 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 57,877 వరకూ వెనకడుగు వేసింది. గత ఐదు రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు రూ. 2,100 వరకూ నష్టపోయినట్లు బులియన్‌ విశ్లేషకులు తెలియజేశారు.

బలహీనపడ్డాయ్‌..
న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 1.25 శాతం పతనమై 1,788 డాలర్లను తాకింది. స్పాట్‌ మార్కెట్లోనూ మరింత అధికంగా 1.55 శాతం(28 డాలర్లు) పడిపోయి 1,788 డాలర్లకు చేరింది. వెండి ఏకంగా 3.5 శాతం కుప్పకూలి ఔన్స్ 22.64 డాలర్ల వద్ద నిలిచింది. గత వారం పసిడి ధరలు 4 శాతంపైగా జారినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement