సాగులో డ్రోన్ల వినియోగం వేగవంతం

11 Mar, 2022 05:37 IST|Sakshi

కేంద్రంలో మూడు విభాగాల కసరత్తు

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని మూడు విభాగాలు దీనిపై సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్‌ (డీపీపీక్యూఎస్‌) సీనియర్‌ అధికారి రవి ప్రకాశ్‌ ఈ విషయాలు తెలిపారు. డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతించాలంటూ డీపీపీక్యూఎస్‌లో భాగమైన సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్‌ బోర్డు అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ (సీఐబీఅండ్‌ఆర్‌సీ)కి ఎనిమిది పంట సరక్షణ కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

పంట పర్యవేక్షణ, ఆగ్రో రసాయనాలు స్ప్రే చేయడం తదితర అవసరాల కోసం డ్రోన్లను వినియోగించేందుకు ఉద్దేశించిన ఈ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్‌ చేయడంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), వ్యవసాయ శాఖ, సీఐబీఅండ్‌ఆర్‌సీ కలిసి పని చేస్తున్నాయని ప్రకాశ్‌ చెప్పారు. క్రాప్‌లైఫ్‌ ఇండియా, థింక్‌ఏజీ సంయుక్తంగా నిర్వహించిన పరిశ్రమ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు.  

ఎన్‌ఐపీహెచ్‌ఎం శిక్షణా కోర్సు..
డ్రోన్లను ఎగరేయడం, స్ప్రే చేయడం వంటి అంశాల్లో డ్రోన్‌ పైలట్లు, ఆపరేటర్లకు శిక్షణనిచ్చేందుకు పది రోజుల ట్రెయినింగ్‌ కోర్సును రూపొందించినట్లు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) జాయింట్‌ డైరెక్టర్‌ విధు కాంపూరథ్‌ తెలిపారు. దీనికి డీజీసీఏ క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మాడ్యూల్‌తో డ్రోన్‌ పైలట్‌కు పదేళ్లు వర్తించే లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నారు. ఫినిష్డ్‌ డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించడం వల్ల దేశీయ తయారీ పరిశ్రమకు ఊతం లభించగలదని డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ స్మిత్‌ షా తెలిపారు.

మరిన్ని వార్తలు