Growing Demand For Spacious Houses: Anarock Report - Sakshi
Sakshi News home page

అబ్బో ఎంత పెద్ద ఇళ్లో... విస్తీర్ణమైన గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌ 

Published Sat, Jun 24 2023 8:38 AM

growing demand for spacious houses anarock report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి కొనుగోలు నిర్ణయంలో విస్తీర్ణం కూడా ప్రధానమైనదే. ఎవరు ఇంటికొచ్చినా అబ్బా ఎంత పెద్ద ఇళ్లో అనిపించుకోవాలనే కోరిక ప్రతీ గృహ కొనుగోలుదారులకు ఉంటుంది. ఫలితంగా దేశంలో ఏటేటా గృహ విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇంటి విస్తీర్ణాలలో 7 శాతం వృద్ధి నమోదైంది. 2018లో 1,150 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణం.. 2023 నాటికి 1,225 చ.అ.లకు పెరిగిందని అనరాక్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది.

గృహ కొనుగోలు ఎంపికలో కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2020 కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు గృహాలకు ఆర్ధిక ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఈ ఇళ్ల నిర్వహణ సులువు వంటి రకరకాల కారణాలతో చిన్న సైజు గృహాలను కొనుగోలుదారులకు ఎక్కువగా కోరుకునేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి వర్క్‌ ఫ్రం హోమ్, ఆన్‌లైన్‌ క్లాస్, ఐసోలేషన్‌ గది వంటి కొత్త అవసరాలు ఏర్పడటంతో ఇంటి విస్తీర్ణాలు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత నాలుగేళ్లలో తొలిసారికి గృహ విస్తీర్ణాలు పెరగడం ప్రారంభమైంది. 2023 నుంచి ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ.. పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది.

  • హైదరాబాదీలు విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ లోనే యూనిట్‌ సైజులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఫ్లాట్‌ విస్తీర్ణం సగటున 2,200 చ.అ.లుగా ఉన్నాయి. ఏడాదిలో ఫ్లాట్ల సైజులలో 29 శాతం మేర వృద్ధి నమోదయింది. 2022 క్యూ1లో 1,700 చ.అ.లుగా ఉన్న ఫ్లాట్ల సగటు విస్తీర్ణం.. 2023 క్యూ1 నాటికి 2,200 చ.అ.లకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలోనే పెద్ద సైజు గృహాలలో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. 
  • అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో ఫ్లాట్ల సైజులు 50 శాతం మేర పెరిగాయి. 2022 తొలి త్రైమాసికం (క్యూ1)లో 1,130 చ.అ.లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,700 చ.అ.లకు పెరిగాయి. బెంగళూరులలో 1,200 చ.అ. నుంచి 1,300 చ.అ.లకు, కోల్‌కతాలో 800 చ.అ.ల నుంచి 1,150 చ.అ., పుణేలో 877 చ.అ. నుంచి 1,013 చ.అ.లకు పెరిగాయి. 
  • ముంబై,చెన్నైలలో క్షీణత: ఆశ్చర్యకరంగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), చెన్నైలలో గృహ విస్తీర్ణాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. 2013లో 932 చ.అ.లుగా ఉన్న ఇంటి సగటు విస్తీర్ణాలు.. 2022 క్యూ1 నాటికి 783 చ.అ.కు, 2023 క్యూ1 నాటికి 743 చ.అ.కు పడిపోయాయి. 2019తో పోలిస్తే 2020లో మాత్రమే ఫ్లాట్ల విస్తీర్ణాలలో 21 శాతం వృద్ధి నమోదు కాగా.. ఆ తర్వాతి ఏడాది నుంచి విస్తీర్ణాలలో క్షీణతే కనిపిస్తుంది. చెన్నైలో ఏడాది కాలంలో విస్తీర్ణాలు 6 శాతం మేర తగ్గాయి. 2022 క్యూ1లో 1,250 చ.అ. లుగా ఉండగా.. 2023 క్యూ1 నాటికి 1,175 చ.అ.లకు క్షీణించాయి.  
  • కరోనా తొలి దశలో చిన్నవైనా పర్లేదు సొంతిల్లు కావాలనే భావన గృహ కొనుగోలుదారులలో రావటంతో అప్పటి నుంచి ఎంఎంఆర్‌లో ఫ్లాట్ల విస్తీర్ణాలు క్రమంగా తగ్గుతున్నాయని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. ఎంఎంఆర్, చెన్నైలలో పెద్ద సైజు గృహాల సరఫరా తగినంత ఉండటం, ఖరీదైన మార్కెట్లు కావటం కూడా చిన్న సైజు ఇళ్ల సరఫరా పెరగడానికి కారణమని పూరీ వివరించారు.

 

Advertisement
Advertisement