హైదరాబాద్‌లో మహిళల ఉపాధి ఎలా ఉందంటే.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం

Published Sat, Apr 6 2024 8:58 AM

Growth In Female Labour Force Participation in India - Sakshi

మహిళలను వంటిట్లోకే పరిమితం చేసే రోజులుపోయాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదిగేందుకు వారికి సరైన అవకాశాలు కల్పిస్తున్నారు. ఈమేరకు దాదాపు అందరిలోనూ అవగాహన ఏర్పడుతోంది. దేశ జనాభాలో 69.2 కోట్ల మంది మహిళలు కాగా.. అందులో 37 శాతం మంది ఉద్యోగం లేదా ఉపాధి కలిగి ఉన్నారని కెరియర్‌నెట్‌ అనే టాలెంట్‌ సొల్యూషన్ల సంస్థ తన నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌, పుణె, చెన్నై వంటి నగరాలు మహిళా ఉపాధి విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయని తెలిపింది. 25,000 ఉద్యోగ నియామకాలను విశ్లేషించిన తర్వాత ‘ద స్టేట్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’ పేరిట నివేదిక రూపొందించారు. 

నివేదికలోని వివరాల ప్రకారం.. 2022తో పోలిస్తే 2023లో ఉద్యోగ నియామకాల్లో మహిళల ప్రాధాన్యం 2-3% పెరిగింది. ముఖ్యంగా జూనియర్‌ ప్రొఫెషనల్‌, ఎగ్జిక్యూటివ్‌ బోర్డుల్లో ఈ మార్పు కనిపించింది. గతేడాది ఉద్యోగాల్లో చేరిన 40శాతం మంది మహిళలు తాజాగా కళాశాలల నుంచి వచ్చినవారే. 0-3 ఏళ్లు, 3-7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగాల్లో మహిళల వాటా 20-25% ఉంది. దిల్లీ, ఎన్‌సీఆర్‌ మినహా దాదాపు అన్ని నగరాల్లో మహిళా నియామకాల నిష్పత్తి పెరిగింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 34శాతం నియామక రేటు నమోదు కాగా.. పుణెలో 33 శాతం, చెన్నైలో 29 శాతం ఉంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 20 శాతం క్షీణత కనిపించింది.

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో మహిళల నియామకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌(జీసీసీలు), బహుళజాతి కంపెనీ(ఎమ్‌ఎన్‌సీ)ల ఆఫ్‌షోర్‌ యూనిట్లలో ఆ ధోరణి కనిపిస్తోంది. పురుషులు, మహిళల మధ్య వేతన అంతరం 2022లో 30 శాతంగా ఉండగా.. గతేడాది 20 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: పెరిగిన వెజ్‌ భోజనం ధర.. తగ్గిన నాన్‌వెజ్‌ ఖరీదు

గత రెండేళ్లుగా మధ్య స్థాయి యాజమాన్య హోదాల్లో మహిళల నియామకంలో ఎటువంటి మార్పూ(23%) లేదు. తిరిగి ఉద్యోగాల్లో చేరే సమయంలో మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత అంకురాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతోందని నివేదిక ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement