Sakshi News home page

జీఎస్‌టీకి ఐదేళ్లు పూర్తి

Published Fri, Jul 1 2022 2:55 AM

GST completes five years - Sakshi

న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్‌టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్‌ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది.

గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్‌టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది.

లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్‌టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్‌టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్‌ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్‌టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్‌టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్‌ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం.  

శ్లాబుల క్రమబద్ధీకరణ
మరోవైపు జీఎస్‌టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్‌లను కూడా జీఎస్‌టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్‌ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్‌టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్‌టీ కౌన్సిల్‌ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి.  

టెక్నాలజీతో లీకులకు చెక్‌
జీఎస్‌టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్‌టీ నెట్‌వర్క్‌ అందిస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది.

మరింత సులభంగా ఉండాలి..
ఈ ఐదేళ్లలో జీఎస్‌టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్‌లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్‌టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్‌టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్‌టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్‌మెంట్‌ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్‌ జీ ప్రభాకరన్‌ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్‌మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ పై జీఎస్‌టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్నర్‌ రజత్‌ మోహన్‌ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ లను కూడా జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement