వ్యాపారంపై జీఎస్టీ రిటర్న్‌! ఏ సందర్భాల్లో వేయాలంటే.. | Sakshi
Sakshi News home page

వ్యాపారంపై ‘జీఎస్టీ రిటర్న్‌’ క్లారిటీ..! ఏ సందర్భా‍ల్లో వేయాలంటే..

Published Mon, Dec 13 2021 11:30 AM

GST Relief for small businesses And Experts Opinion Telugu - Sakshi

ప్రశ్న: నేను 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేశాను. రీఫండ్‌ వచ్చింది. 2022కి సంబంధించి ట్యాక్సబుల్‌ ఇన్‌కం లేదు. రిఫండ్‌ ఎంత వస్తుంది? 
– ఎం సౌదామిని, చిత్తూరు

 
సమాధానం: మీరు ఆదాయం వివరాలు, చెల్లించిన పన్ను వివరాలు పూర్తిగా తెలియజేయాలి. ట్యాక్సబుల్‌ ఇన్‌కం లెక్కించిన తర్వాత కానీ పన్నుభారం లెక్కించలేము. 31–03–2021కి రిఫండు వచ్చిందంటే దాని అర్థం మీరు ఆ సంవత్సరంలో అవసరమైన మొత్తం కన్నా ఎక్కువ పన్ను చెల్లించారు. టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా చెల్లించిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే, మదింపు చేసి అధికంగా కట్టిన మొత్తాన్ని రిఫండుగా ఇచ్చి ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మీరు పన్ను చెల్లించారా? టీడీఎస్‌ ఉందా? ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 5,00,000 లోపు ఉంటే మీకు పన్ను ఉండదు. కానీ టీడీఎస్‌/అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించారా? అవి లేకపోతే ఎటువంటి రిఫండు రాదు. మీరు ముందుగా చెల్లించకపోతే మీకు రిఫండు ఎందుకు వస్తుంది. నగదు బదిలీ పథకం లాగా రిఫండు రాదు.
---------------------------------------------- 

ప్రశ్న: నేను వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలా జీఎస్‌టీ రిటర్నులు వేస్తున్నాను. ఇంటి మీద అద్దె వస్తోంది. వ్యవసాయం మీద ఆదాయం వస్తోంది. పాన్‌ ఉంది. తలా ఒక మాట చెబుతున్నారు. రిటర్ను వేయాలా వద్దా? తికమకగా ఉంది? ఏం చేయాలి? 
– ఎన్‌.ఆర్‌. పంతులు, విశాఖపట్నం 

సమాధానం: జీఎస్‌టీ రిటర్నులు ప్రతి నెలా వేస్తున్నాం అంటున్నారు. అంటే ‘రెగ్యులర్‌‘ అన్న మాట. టర్నోవరు బాగా ఉన్నట్లు. అద్దెకు ఇళ్లు ఇచ్చారు. అద్దె వస్తోంది. వ్యవసాయం మీద ఆదాయం ఉంది. పాన్‌ ఉంది. లావాదేవీలు నగదు రూపంలో చేస్తున్నారా? అలా చేస్తుంటే తప్పు. బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? వాటిలో జమలు ఉన్నాయా .. లేవా? ఎవ్వరి మాటా వినొద్దు. తికమక పడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే .. బ్యాంకు అకౌంట్లలో ’డిపాజిట్ల’ నిమిత్తం ఎంత మొత్తం వచ్చిందో రాసుకోండి. అద్దె ఎంత? వ్యవసాయం మీద ఆదాయం ఎంత? నగదులో వస్తే బ్యాంకులో జమ చేయండి? జీఎస్‌టీ రిటర్నుల ప్రకారం టర్నోవరు వివరాలు సిద్ధంగా ఉంటాయి. దానికి సంబంధించిన కొనుగోళ్ల వివరాలూ ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ ఒక పుస్తకంలో సక్రమంగా రాయండి. తెలుగులోనూ అకౌంట్లు రాయవచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో ఎన్నో అకౌంటింగ్‌ ప్యాకేజీలు ఉన్నాయి. త్వరగా అకౌంట్లు రాయవచ్చు. వ్యాపారం లాభనష్టాలను లెక్కించండి. అన్ని ఆదాయాలను లెక్కించి ఒక స్టేట్‌మెంట్‌ తయారు చేసుకోండి. మీకే తెలిసిపోతుంది. గందరగోళం .. గజిబిజి ఉండదు. ఆదరాబాదరా అసలే ఉండదు. చట్టప్రకారం మీరు రిటర్ను వేయాలి. వేయకపోవటం తప్పే. కుంటి సాకులు వద్దు. మీనమేషాల లెక్కించకండి. త్వరగా తప్పనిసరిగా వేయండి.  

 పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్‌ పంపించగలరు. 


 - కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య.. ట్యాక్సేషన్‌ నిఫుణులు 

Advertisement

తప్పక చదవండి

Advertisement