GSTN looking for consultancy firm to prepare roadmap for transitioning IT systems to GST 2.0 - Sakshi
Sakshi News home page

ముగియనున్న ఇన్ఫోసిస్‌ కాంట్రాక్టు..  కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌పై జీఎస్‌టీఎన్‌ కసరత్తు

Published Fri, Aug 18 2023 8:44 AM

GSTN looking for consultancy firm for transitioning IT systems to GST 2 0 - Sakshi

న్యూఢిల్లీ: సాంకేతిక సహకారం అందించేందుకు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన కాంట్రాక్టు 2024 సెప్టెంబర్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎంపికపై వస్తు, సేవల పన్నుల నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌) దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్‌ డాక్యుమెంట్లను తయారు చేసే కన్సల్టెన్సీ కోసం అన్వేషణ ప్రారంభించింది.

బిడ్డింగ్‌ ప్రక్రియ, జీఎస్‌టీఎన్‌ ఐటీ వ్యవస్థను మరో సర్వీస్‌ ప్రొవైడర్‌కు బదలాయించడం తదితర పనులను సదరు కన్సల్టెన్సీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత వ్యవస్థను మదింపు చేసి తదుపరి కాంట్రాక్టు వ్యవధిలో దాన్ని మరింత మెరుగుపర్చేందుకు తగు మార్గదర్శకాలు రూపొందించాలి. దేశీయంగా ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నులు లేక ఇతరత్రా ఆర్థిక సంస్థకు ఐటీ కన్సల్టింగ్‌ సర్వీసులు అందించడం ద్వారా గత మూడేళ్లలో సగటున రూ. 30 కోట్ల వార్షిక టర్నోవరు ఉన్న కన్సల్టెన్సీలు ఇందుకు పోటీపడొచ్చని జీఎస్‌టీఎన్‌ తెలిపింది.

బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ సెప్టెంబర్‌ 5. కొత్త కాంట్రాక్టు 2024 అక్టోబర్‌ 1 నుంచి ఏడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. దానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించేందుకు 2015లో రూ. 1,320 కోట్ల కాంట్రాక్టును ఇన్ఫోసిస్‌ దక్కించుకుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్, రిటర్నుల ఫైలింగ్, ఆడిట్‌ మొదలైన వాటికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఇన్ఫోసిస్‌ అందిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement