ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్‌! షాకిచ్చిన టాప్‌ ప్రైవేట్‌ బ్యాంక్

7 Aug, 2023 18:12 IST|Sakshi

HDFC Bank ​hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా అవతరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది.

మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్‌ రేట్‌ను  9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. 

ఎంసీఎల్ఆర్ అంటే..
ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.
 

మరిన్ని వార్తలు