మేలో నియామకాల్లో క్షీణత | Sakshi
Sakshi News home page

మేలో నియామకాల్లో క్షీణత

Published Fri, Jun 9 2023 4:13 AM

Hiring slows down by 7percent in May as companies become cautious - Sakshi

ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్‌ (మాన్‌స్టర్‌ ఏపీఏసీ అండ్‌ ఎంఈ) ‘ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది.

అహ్మదాబాద్, జైపూర్‌ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.

ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్‌ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది.

కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్‌ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్‌/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్‌ సీఈవో శేఖర్‌ గరీశ తెలిపారు. ఆన్‌లైన్‌లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్‌ విడుదల చేస్తుంటుంది.

హైదరాబాద్‌లోనూ డౌన్‌
హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్‌ తెలిపింది. అహ్మదాబాద్లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement