హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు | Housing Sales At 6-Year High In July September Quarter Knight Frank - Sakshi
Sakshi News home page

కొంటూనే ఉన్నారు.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు

Published Thu, Oct 5 2023 7:49 AM

Housing Sales At 6 Year High In July September Quarter Knight Frank - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. 8,325 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 7,900గా ఉన్నాయి. ఇళ్ల ధరలు సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 11 శాతం పెరిగాయి.

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో ఇళ్ల విక్రయాలు 12 శాతం పెరిగి 82,612 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసిక అమ్మకాలు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఇళ్లకు బలమైన డిమాండ్‌ ఉన్నట్టు పేర్కొంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 73,691 యూనిట్లుగానే ఉన్నాయి.  

పట్టణాల వారీగా అమ్మకాలు 

  •      ముంబైలో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4 శాతం పెరిగాయి. 22,308 యూనిట్లు అమ్ముడుపోయాయి.  
  •      ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 13,981 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. 
  •      బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 13,619 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13,013 యూనిట్లతో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగాయి. 
  •      పుణె మార్కెట్లో 20 శాతం వృద్ధితో 13,079 ఇళ్లు అమ్ముడయ్యాయి. 
  •      చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో 3,870 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి.  
  •      కోల్‌కతాలో అమ్మకాలు 3,772 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 1,843 యూనిట్లుగా ఉన్నాయి.  
  •      అహ్మదాబాద్‌లో 6 శాతం అధికంగా 4,108 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. 

ధరల్లోనూ పెరుగుదల 
డిమాండ్‌కు అనుగుణంగా వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరల పెరిగినట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అత్యధికంగా హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు 11% పెరిగాయి. కోల్‌కతాలో 7%, బెంగళూరు, ముంబై మార్కెట్లలో 6% చొప్పున, పుణెలో 5%, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 4%, చెన్నై మార్కెట్లో 3% చొప్పున ధరలు పెరిగాయి.

‘‘డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుండడంతో ఇళ్ల నిల్వలు (అమ్ముడుపోని) గణనీయంగా పెరిగాయి. ఇళ్ల అమ్మకాలు బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. మొత్తం మీద మార్కెట్లో ఆరోగ్యకర పరిస్థితి నెలకొంది’’అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement