రూ.30 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే.. గరిష్ట రాబడులు ఎలా? | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే.. గరిష్ట రాబడులు ఎలా?

Published Mon, May 1 2023 7:10 AM

How to maximize returns on investments - Sakshi

నా వయసు 38 ఏళ్లు. కార్పొరేట్‌ రంగంలో పనిచేస్తున్నాను. 40 ఏళ్లకే రిటైర్మెంట్‌ తీసుకోవాలన్నది నా ప్రణాళిక. కనుక రిటైర్మెంట్‌ కోసం ఎంత ఫండ్‌ కావాలో తెలుసుకుందామంటే ఆన్‌లైన్‌లో ఎన్నో రిటైర్మెంట్‌ కాలిక్యులేటర్లు ఉన్నాయి. వీటిల్లో కచ్చితమైన నంబర్లు చూపించేది ఏదైనా ఉందా? – విష్ణు నివాస్‌

ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. ద్రవ్యోల్బణం మీ జీవన వ్యయాలను పెంచుతుంది. రిటైర్మెంట్‌కు ఎంత కావాలనే విషయాన్ని ఇదే క్లిష్టంగా మార్చేస్తుంది. ఇందుకోసం ఓ ఆచరణాత్మక సూత్రాన్ని అనుసరించొచ్చు. ప్రస్తుతం వార్షిక వ్యయాలు ఎంత? ఈ మొత్తానికి ఏటా 6 శాతం ద్రవ్యోల్బణాన్ని రిటైర్మెట్‌ పీరియడ్‌ వరకు కలపాలి. రిటైర్మెంట్‌ తర్వాత జీవించి ఉండే కాలంతో (అంచనా) దీన్ని హెచ్చించాలి. ఉదాహరణకు ప్రస్తుతం మీకు నెలవారీ ఖర్చులు రూ.50వేలు ఉన్నాయనుకుంటే, ఏడాదికి రూ.6 లక్షలు అవుతుంది. పదేళ్లలో రిటైర్‌ అవుతారు.

ఈ పదేళ్ల కాలానికి 6 శాతం ద్రవ్యోల్బణం కలిపి చూస్తే ప్రస్తుతం ఉన్న వార్షిక జీవన వ్యయం రూ.6 లక్షలు కాస్తా, పదేళ్ల తర్వాత 10.74 లక్షలకు పెరుగుతుంది. మీరు 48 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుని, 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, అప్పుడు రిటైర్మెంట్‌ తర్వాత 32 ఏళ్ల జీవన కాలం ఉంటుంది. 32 ఏళ్లను వార్షిక జీవన వ్యయం 10.74 లక్షలతో లెక్కిస్తే అప్పుడు రూ.3.44 కోట్లు అవుతుంది. ఈ మొత్తం రిటైర్మెంట్‌ ఫండ్‌గా కావాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే ఈ మొత్తం సమకూరుతుంది. దీర్ఘకాలం లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. డెట్‌ ఆధారిత సాధనాలైన ప్రావిడెంట్‌ ఫండ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తగినవి కావు.  

నేను రూ.30 లక్షలు ఇన్వెస్ట్‌ చేద్దామని అనుకుంటున్నాను. గరిష్ట రాబడులు రాబట్టుకోవడం ఎలా? – కేశవ్‌ జాదవ్‌ 

సంపద వృద్ధి చెందడానికి పెట్టుబడి ఒక మార్గం. ఒక ఇన్వెస్టర్‌గా మీ లక్ష్యం గరిష్ట రాబడి ఒక్కటే కాకూడదు. దీనికి బదులు మెరుగైన రాబడుల కోసం పెట్టుబడుల విషయంలో కొన్ని టిప్స్‌ అనుసరించొచ్చు. ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం రాబడి కోణంలోనే పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుంటే అది నష్టానికి దారితీయవచ్చు. అందుకుని ప్రతీ పెట్టుబడి ఆప్షన్‌కు ముందు సానుకూల, ప్రతికూలతలను చూడాలి.

ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. కానీ అది ఖచ్చితం అని చెప్పలేం. పైగా అస్థిరతలు ఎక్కువ. మార్కెట్‌ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మార్కెట్లు కరెక్షన్‌కు లోనై ఉంటే అప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకుని స్వల్పకాలానికి ఈ తరహా రిస్క్‌ను అధిగమించేందుకు డెట్‌ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులు ఐదేళ్లు, అంతకుమించిన కాలానికి ఉండాలి.

ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫండ్‌ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్‌ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్వల్ప కాలంలో పెట్టుబడులపై మార్కెట్‌ కరెక్షన్ల ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరిగా అస్సెట్‌ అలోకేషన్‌ను పాటించాలి. డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు, వాటిని ఏడాదికోసారి సమీక్షించుకోవాలి.  మీ లక్ష్యాలు, రిస్క్‌ సామర్థ్యానికి అనుగుణంగా డెట్, ఈక్విటీ కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి.

ధీరేంద్ర కుమార్ - సీఈఓ, వ్యాల్యూ రీసర్చ్

Advertisement
 
Advertisement
 
Advertisement