వైద్య రంగంలో పెనుమార్పులు.. మతి పోగొడుతున్న కొత్త టెక్నాలజీలు! | Sakshi
Sakshi News home page

హెల్త్‌ కేర్‌ స్మార్ట్‌ టెక్‌

Published Sun, Jan 28 2024 8:00 AM

How Technology Is Changing Health Care - Sakshi

ఇది సాంకేతిక విప్లవయుగం. సాంకేతిక విప్లవం ప్రపంచంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు వైద్యరంగంలోకి కూడా దూసుకొస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగంలో పెనుమార్పులకు దారులు వేస్తోంది. ప్రస్తుత శతాబ్దిలో ఇప్పటికే వైద్యరంగంలోకి అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏడాది కొత్త కొత్త పరికరాలు వైద్యరంగంలోకి అడుగుపెడుతూ చికిత్స పద్ధతులను మరింతగా సులభతరం చేస్తున్నాయి.

జ్వరం తెలుసుకోవాలంటే థర్మామీటర్‌...
ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవాలంటే స్టెతస్కోప్‌... శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి పల్సాక్సి మీటర్‌...ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న పరికరాలు. ఈ అన్ని లక్షణాలనూ తెలిపే పరికరం తాజాగా రూపుదిద్దుకుంది. మన అందచందాలను చూసుకోవడానికి అద్దం వాడుతుంటాం. మరి, మన మానసిక పరిస్థితిని తెలుసుకోవడానికో? దానికి కూడా ఒక అధునాతన అద్దం అందుబాటులోకి వచ్చేసింది. తలనొప్పి వస్తే తలకు ఏ అమృతాంజనం పట్టించుకోవడమో లేదా ఒక తలనొప్పి మాత్ర వేసుకోవడమో చేస్తుంటాం. ఇక ఆ బెడద లేకుండా, తలనొప్పి తీవ్రతకు తగినంత మోతాదులో ఔషధాన్ని విడుదల చేసే హెడ్‌బ్యాండ్‌ తయారైంది. ఆరోగ్యరంగంలో పెనుమార్పులకు దారితీయగలిగిన వస్తువుల్లో ఇవి కొన్ని. ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన సాంకేతిక పరికరాలు కూడా గడచిన ఏడాదికాలంలో తయారయ్యాయి. ఈ పరికరాలను వాటి తయారీదారులు లాస్‌ వేగస్‌లో ఈ ఏడాది జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో–2024 (సీఈఎస్‌) వేదికపై ప్రదర్శించారు. వీటికి శాస్త్రవేత్తల నుంచి మాత్రమే కాకుండా, సామాన్య సందర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. సరికొత్త వైద్య పరికరాలపై సంక్షిప్త పరిచయంగా ఈ కథనం మీ కోసం..

ఫోర్‌ ఇన్‌ వన్‌ ‘బీమ్‌ఓ’
అరచేతిలో ఇమిడిపోయే ఈ ఒక్క చిన్నపరికరం దగ్గర ఉంటే థర్మామీటర్, స్టెతస్కోప్‌ వంటివేవీ అవసరం ఉండదు. ఇది ఫోర్‌ ఇన్‌ వన్‌ పరికరం. అమెరికాలోని శాన్‌హోసే స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సాయంతో ‘బీమ్‌ఓ’ కంపెనీ ఈ ఫోర్‌ ఇన్‌ వన్‌ పరికరాన్ని తయారుచేసింది. దీనిని నుదుటి మీద ఆనించి జ్వరం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఛాతీ మీద ఆనించి ఊపరితిత్తుల పనితీరును, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. అలాగే శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిని తెలుసుకోవచ్చు. దీనిలోని సెన్సర్లు శరీరంలోని సూక్ష్మమైన తేడాలను సైతం ఇట్టే గుర్తించి, శరీర ఆరోగ్య స్థితిగతులపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్‌కు చేరిన సమాచారాన్ని డాక్టర్‌కు చూపించి సత్వరమే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ‘బీమ్‌ఓ’ పరికరం విస్తృతంగా వాడుకలోకి వచ్చినట్లయితే, వైద్యరంగంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న థర్మామీటర్, స్టెతస్కోప్, పల్సాక్సిమీటర్‌ వంటి పరికరాలు దాదాపు కనుమరుగు కాగలవు. ‘బీమ్‌ఓ’ ఈ ఏడాది జూన్‌లో మార్కెట్‌లోకి రానుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,701) మాత్రమే!

మనసును చూపించే అద్దం
అద్దంలో ముఖం చూసుకోవడం మామూలే! ఈ అద్దం మాత్రం మన మనసుకే అద్దంపడుతుంది. మన ఒత్తిడి, చిరాకు, పరాకు, దిగులు, గుబులు వంటి లక్షణాలను ఈ అద్దం ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. అమెరికాలోని సీయాటల్‌కు చెందిన ‘బారాకోడా’ కంపెనీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ అద్దాన్ని ‘బి మైండ్‌’ పేరుతో రూపొందించింది. ఈ అద్దం బాత్‌రూమ్‌లో ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది టచ్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులోని కేర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా మన మానసిక స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇందులోని నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఈ అద్దం మన భావోద్వేగాల్లోని మార్పులను సత్వరమే గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. భావోద్వేగాల్లో తేడాలు ఉన్నట్లయితే, ఇందులోని లైట్‌ థెరపీ ఆటోమేటిక్‌గా పనిచేసి, సాంత్వన కలిగిస్తుంది. సీఈఎస్‌–2024లో ప్రదర్శించిన ఈ స్మార్ట్‌ అద్దం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఈ ఏడాది చివరిలోగా మార్కెట్‌లోకి రానుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ స్మార్ట్‌వాచీ
ఇప్పటికే ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ స్మార్ట్‌వాచీలను పలు కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అమెరికన్‌ కంపెనీ గార్మిన్‌ తాజాగా ‘లిలీ–2’ పేరుతో ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ స్మార్ట్‌వాచీని విడుదల చేసింది. దీనిని సీఈఎస్‌–2024 షోలో ప్రదర్శించింది. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌వాచీలతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే కాకుండా, డిజైన్‌ ఆకర్షణీయంగా ఉండటం విశేషం. ‘లిలీ–2’ స్మార్ట్‌ వాచీలను గార్మిన్‌ కంపెనీ ‘క్లాసిక్‌’, ‘స్పోర్ట్స్‌’ అనే రెండు మోడల్స్‌లో విడుదల చేసింది. దీని డయల్‌పై ఉన్న టచ్‌స్క్రీన్‌ను తడితే, ఇది సమయం చూపడమే కాకుండా, శరీరంలోని ఎనర్జీ లెవల్స్‌ను, స్లీప్‌ స్కోర్‌ను చూపిస్తుంది. ఇది ధరించిన వారి శరీరం పనితీరును నిరంతరాయంగా గమనిస్తూ, స్మార్ట్‌ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. గుండె పనితీరు, అలసట స్థాయి, నిద్ర తీరుతెన్నులు, ఆటలాడేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఖర్చయ్యే కేలరీలు, శరీరంలో నీటి స్థాయి, శ్వాస తీరు, ఆక్సిజన్‌ లెవల్స్, మహిళల నెలసరి పరిస్థితుల వంటి అంశాలపై ఇది కచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. లిలీ–2 స్పోర్ట్స్‌ మోడల్‌ ధర 249.99 డాలర్లు (రూ.20,782), క్లాసిక్‌ మోడల్‌ ధర 279.99 డాలర్లు (రూ.23,276) మాత్రమే!

వృద్ధుల కోసం మెడికల్‌ అలర్ట్‌ సిస్టమ్‌
చూడటానికి ఇది దోమలను పారదోలే పరికరంలా కనిపిస్తుంది గాని, ఇది వృద్ధులకు ఆసరగా పనిచేసే అధునాతన మెడికల్‌ అలర్ట్‌ సిస్టమ్‌. ఫ్రాన్స్‌కు చెందిన ‘జో కేర్‌’ కంపెనీ నిపుణులు దీనిని ‘జో ఫాల్‌’ పేరుతో రూపొందించారు. కాలుజారడం, రక్తపోటు పడిపోవడం, గుండెపోటు, పక్షవాతం వంటి కారణాలతో ఇళ్లలోని వృద్ధులు అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు వైఫై ద్వారా ఈ పరికరంలోని సెన్సర్లు వెంటనే గుర్తించి, దీనికి అనుసంధానమైన స్మార్ట్‌ఫోన్‌కు చేరవేసి అప్రమత్తం చేస్తుంది. సీసీ కెమెరాలు, తొడుక్కోవలసిన పరికరాలతో పనిలేకుండా, దీనిని గోడకు ప్లగ్‌ సాకెట్‌కు తగిలించుకుంటే చాలు. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనిని అమర్చిన ప్రదేశానికి 800 చదరపు మీటర్ల పరిధిలో నేల మీద ఎవరు పడిపోయినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది. సీఈఎస్‌–2024 షోలో దీనికి సందర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ
ఇవి పోషకాల గుళికలు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ద్వారా తయారైన స్మార్ట్‌ గమ్మీస్‌ ఇవి. ఏడు పోషకాలతో కూడిన ఈ స్మార్ట్‌ గమ్మీస్‌ను ఫిన్లండ్‌కు చెందిన ‘ఇలో స్మార్ట్‌ న్యూట్రిషన్‌’ కంపెనీ విడుదల చేసింది. సాధారణమైన విటమిన్‌ మాత్రలైతే, అందరికీ ఒకేలాంటివి దొరుకుతాయి. వీటిని ఎవరి అవసరాలకు తగినట్లుగా వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకునే వీలు ఉండటం విశేషం. 38.9 కోట్ల కాంబినేషన్లలోని పోషకాల మోతాదులతో కూడిన ఈ స్మార్ట్‌ పిల్స్‌ను కోరుకున్న రుచులతో త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా ముద్రించుకోవచ్చు. నోటికి నచ్చిన రుచుల్లో దొరికే వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు, శరీరంలోని పోషక లోపాలన్నీ సత్వరమే నయమవుతాయి. పోషకాల కాంబినేషన్లను బట్టి ఈ గమ్మీస్‌ ఒక్కో ప్యాక్‌ ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (రూ.1247 నుంచి రూ.1662) వరకు ఉంటుంది.

అల్ట్రాహ్యూమన్‌ హోమ్‌
వైఫై రూటర్‌లా కనిపించే ఈ పరికరం ఇంటిల్లిపాదికీ ఆరోగ్యరక్షణ కల్పిస్తుంది. అమెరికన్‌ కంపెనీ ‘అల్ట్రాహ్యూమన్‌’ ఈ పరికరాన్ని ‘అల్ట్రాహ్యూమన్‌ హోమ్‌’ పేరుతో రూపొందించింది. రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ పరికరాన్ని ఇంట్లో అనువైన చోట అమర్చుకుని, ఆన్‌ చేసుకుంటే చాలు. ఇది నిరంతరం ఇంటి వాతావరణంలోని మార్పులను గమనిస్తూ, యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇంట్లోని ఉష్ణోగ్రత, గాలిలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, ధూళికణాలు, కార్బన్‌ కణాలు వంటివి ఏ మేరకు ఉన్నాయో కచ్చితంగా చెబుతుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు ఇది అందించే సమాచారం బాగా దోహదపడుతుంది. ‘అల్ట్రాహ్యూమన్‌’ ఈ పరికరాన్ని త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధర 349 డాలర్లు (రూ.29,011) మాత్రమే!

స్మార్ట్‌ పరుపు
ఇది చాలా స్మార్ట్‌ పరుపు. కావలసిన రీతిలో దీని మెత్తదనాన్ని లేదా గట్టిదనాన్ని మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడానికి వీలుగా దీనికి ఒక బటన్‌ అమర్చి ఉంటుంది. సాధారణమైన పరుపులతో పోల్చుకుంటే దీని బరువు దాదాపు ఎనబై శాతం తక్కువగా ఉంటుంది. సాధారణ పరుపులలో వాడే స్ప్రింగులు, ఫోమ్‌ వంటివేవీ ఇందులో ఉండవు. దాదాపు 1.40 కోట్ల పాలీస్టర్‌ దారపు పోగులతో దీనిని తయారుచేయడం విశేషం. దీని బటన్‌ను ఉపయోగిస్తూ, పది కుషన్‌ లెవల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొరియన్‌ కంపెనీ ‘ఆన్సిల్‌’ ఈ పరుపును సీఈఎస్‌–2024 షోలో ప్రదర్శించింది. ‘స్మార్ట్‌ స్ట్రింగ్‌ ఐ4’ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్‌ పరుపులో మరికొన్ని అదనపు సౌకర్యాలూ ఉన్నాయి. ఇందులోని సెన్సర్లను నిద్ర తీరుతెన్నులను గమనిస్తూ, ఆ సమాచారాన్ని యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. ఒంటి బరువులో మార్పులు, గురక వంటి ఇబ్బందులను కూడా ఇది గుర్తిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. మార్కెట్‌లోకి దీనిని ఎప్పుడు విడుదల చేయనున్నదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు ‘ఆన్సిల్‌’ కంపెనీ తెలిపింది.

పర్సనలైజ్డ్‌ న్యూట్రిషనల్‌ ఫుడ్‌ ప్రింటర్‌
మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో పోషకాహార అవసరాలు ఉంటాయి. ఇళ్లల్లో వండుకునే ఉమ్మడి వంటతోనో లేదా హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే వంటకాలతోనో పోషకాహార అవసరాలు పూర్తిగా తీరే పరిస్థితి ఉండదు. వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను కోరుకున్న రుచులతో అందించేందుకు అమెరికన్‌ కంపెనీ ‘ఆనరీ’ ఇటీవల ‘ఇనొవేటివ్‌ ఇండివిడ్యువలైజ్డ్‌ న్యూట్రిషనల్‌ కిట్‌’ (ఐఐఎన్‌కే) పేరుతో ఈ త్రీడీ ఫుడ్‌ ప్రింటర్‌ను రూపొందించింది. ఇందులో ముడి పదార్థాలను తగిన మోతాదులో వేసుకుని, స్విచాన్‌ చేసుకుంటే చాలు. కొద్ది నిమిషాల్లోనే మనకు కావలసిన ఆహారాన్ని, మనకు అవసరమైన పోషకాలు ఉండేలా ముద్రించి పెడుతుంది. ఇది దాదాపు మిగిలిన త్రీడీ ఫుడ్‌ ప్రింటర్‌లాగానే పనిచేస్తుంది. అయితే, దీని తయారీదారులు మాత్రం దీనిని 4డీ ఫుడ్‌ ప్రింటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం మూడు కొలతల్లో ఆహారాన్ని ముద్రించే త్రీడీ ప్రింటర్‌ మాత్రమే కాదని, అంతకు మించి ఇది పదార్థాల్లోని పీహెచ్‌ స్థాయిని, వేడిని కోరుకున్న రీతిలో, కోరుకున్న సమయానికి అందిస్తుందని, అందువల్ల ఇది 4డీ ప్రింటర్‌ అని చెబుతున్నారు. దీనిని సీఈఎస్‌–2024 షోలో ప్రదర్శించారు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

పెంపుడు జంతువులకు హెల్త్‌ట్రాకర్‌
చాలామంది ఇళ్లల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు గాని, వాటి ఆరోగ్యానికి సమస్యలు తలెత్తితే ఇబ్బందే! పెంపుడు జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ పెట్‌ హెల్త్‌ట్రాకర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇళ్లల్లో పెంచుకునే పిల్లులు లేదా జాగిలాలకు మెడలో దీనిని తగిలిస్తే చాలు. యాప్‌ ద్వారా ఇది వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఇన్వోక్సియా కంపెనీ ఈ పెట్‌ హెల్త్‌ట్రాకర్‌ను ‘మినిటాయిల్జ్‌ స్మార్ట్‌ పెట్‌ట్రాకర్‌’ పేరుతో రూపొందించింది. ఇది పెంపుడు జంతువుల దినచర్యపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుంది. పెంపుడు జంతువుల తినే వేళలు, నడక వేళలు, ఆట వేళలు, వాటి భావోద్వేగాలు, వాటి జీర్ణ సమస్యలు, గుండె సమస్యలను ఇది తక్షణమే గుర్తించి, యాప్‌ ద్వారా యజమానులను అప్రమత్తం చేస్తుంది. ఈ పెట్‌ట్రాకర్‌ శునకాల కోసం ఒక మోడల్, పిల్లుల కోసం ఒక మోడల్‌ రూపొందించింది. అయితే, రెండిటి ధర ఒక్కటే– 99 డాలర్లు (రూ.8,230) మాత్రమే! ఈ పెట్‌ట్రాకర్‌ ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి రానుంది.

పట్టుతప్పిన చేతులకు స్మార్ట్‌గ్లోవ్స్‌
వార్ధక్యంలో కొందరు పార్కిన్‌సన్స్‌ వ్యాధి బారినపడతారు. ఈ వ్యాధికి లోనైనవారిలో కీళ్లు బిగుసుకుపోయి, వణుకు పెరిగి, చేతులు పట్టుతప్పుతాయి. పట్టుతప్పిన చేతులతో టీ కప్పు వంటి తేలికపాటి వస్తువులను పట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్‌కు చెందిన ‘గైరోగేర్‌’ కంపెనీ ఈ ‘గైరోగ్లోవ్‌’ను రూపొందించింది. దీని పనితీరును ఇటీవల సీఈఎస్‌–2024 షోలో ప్రదర్శించినప్పుడు దీనికి నిపుణుల ప్రశంసలు లభించాయి. ఇది మాగ్నటిక్‌ కనెక్టర్‌తో రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని చేతికి తొడుక్కుని, ఆన్‌ చేసుకున్న వెంటనే ఇది చేతి వణుకును నియంత్రిస్తుంది. చేతికి పట్టునిస్తుంది. పార్కిన్‌సన్స్‌ వ్యాధితో బాధపడేవారు దీనిని తొడుక్కుని తమ పనులను తామే స్వయంగా చేసుకునేందుకు దోహదపడుతుంది. దీని ధర 550 డాలర్లు (రూ.45,726).

వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు ఈ వస్తువులు తాజా ఉదాహరణలు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్‌ వాచీలు, నొప్పి నివారణ కోసం వాడే స్మార్ట్‌ పట్టీలు, ఇన్సులిన్‌ ఇంజక్షన్ల బదులుగా వాడే స్ప్రేలు వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ పరిజ్ఞానాలు శస్త్రచికిత్సలను మరింతగా సులభతరం చేస్తున్నాయి. ఈ సాంకేతికత ఆరోగ్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయగలదని, మానవాళి ఆరోగ్యానికి మరింత భరోసా ఇవ్వగలదని భావించవచ్చు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement