Hyderabad Airport Directed To Pay 5 Lakh To A Passenger - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఫైన్‌.. కారణం ఇదే!

Published Wed, Oct 6 2021 11:36 AM

Hyderabad Airport Told To Pay Rs 5 Lakh To Injured Passenger - Sakshi

శంషాబాద్‌లో ఉన్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్‌ గ్రూప్‌కి జరిమానా పడింది. ప్రయాణికులకు అందించే సేవల్లో లోపాలు కారణంగా ఈ ఫైన్‌ని తెలంగాణ కన్సుమర్‌ డిస్‌ప్యూట్‌ రిడ్రెస్సల్‌ కమిషన్‌ విధించింది. 

ఘటన జరిగింది ఇలా
సుబ్రతో బెనర్జీ అనే వ్యక్తి 2014 సెప్టెంబరు 10న బెంగళూరు వెళ్లేందుకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు ఎస్కలేటర్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా జర్క్‌ ఇచ్చి ఆగిపోయింది. దీంతో సుబ్రతో బెనర్జీ కింద పడిపోగా ఎస్కలేటర్‌పై ఉన్న ఇతర వ్యక్తులు ఆయనపై పడిపోయారు. దీంతో ఆయన గాయపడ్డారు. 75 రోజుల పాటు ఆఫీసుకు వెళ్లలేకపోయారు. ఎయిర్‌పోర్టులో తనకు కలిగిన అసౌకర్యంపై ఆయన ఫిర్యాదు చేశారు.

మా తప్పేం లేదు
సుబ్రతో ఆరోపణలపై ఎయిర్‌పోర్టు యాజమాన్యం వాదిస్తూ... ఎస్కలేటర్‌పైకి ఒకేసారి ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్‌ లోడ్‌ అయ్యిందని,  దీంతో ఎస్కలేటర్‌ నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆగిందని తెలిపింది. ఎస్కలేటర్‌ ఎప్పుడు ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి రాదని చెప్పింది. సుబ్రతో రాయ్‌ అజాగ్రత్తగా ఉండటం వల్లే పడిపోయాడని ఎయిర్‌పోర్టు యాజమాన్యం న్యాయస్థానంలో వాదించింది. పైగా గాయపడ్డ సుబ్రతో బెనర్జీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని, గుడ్‌విల్‌గా రూ. 1.51 లక్షలు చెల్లించినట్టు వివరించింది.

ఫైన్‌ చెల్లించండి
ఎయిర్‌పోర్టు వాదనపై సుబ్రతో విబేధించారు. ఆస్పత్రిని నుంచి డిస్‌ఛార్జ్‌ అయి వెళ్లిన తర్వాత తనకు తిరిగి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ఆపరేషన్‌ జరిగిందని వివరించారు. దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యానంటూ తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిషన్‌ ఎయిర్‌పోర్టు అథారిటీదే తప్పుగా తేలచ్చింది. బాధితుడికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

అందువల్లే ఫైన్‌
ఎస్కలేటర్‌ వ్యవహారంలో తమ తప్పు లేదంటూ ఎయిర్‌పోర్టు యాజమాన్యం వాదించగా అందుకు తగ్గట్టుగా సీసీ కెమెరా ఫుటేజీ చూపించాల్సిందిగా కమిషన్‌ కోరింది. అయితే ఆ ఫుటేజీని న్యాయస్థానం ముందు ఉంచడంలో ఎయిర్‌పోర్టు యాజామన్యం విఫలమైంది. ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు నిర్వాహణ బాధ్యతలు చూస్తూ సీసీ ఫుటేజీ లేకపోవడం.. నిర్లక్ష్యానికి ఉదాహారణగా కమిషన్‌ భావించింది. బాధితుడి ఆరోపణలో వాస్తవం ఉందని నమ్ముతూ అతనికి పరిహారం చెల్లించాలని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. 
 

చదవండి : పైసల కోసమే ఫేస్‌బుక్‌ కక్కుర్తి! ఛస్‌.. లాజిక్‌ లేదన్న మార్క్‌

Advertisement
Advertisement