Iconic Entrepreneur Philanthropist Shiv Nadar Turns 78: Check Growth and Net Worth - Sakshi
Sakshi News home page

Shiv Nadar: తొలి కంప్యూటర్‌ అందించిన టెక్‌ దిగ్గజం, బిలియనీర్‌ ఎవరో తెలుసా? 

Published Fri, Jul 14 2023 6:15 PM

Iconic entrepreneur philanthropist Shiv Nadar turns 78 check growth and net worth - Sakshi

పారిశ్రామికవేత్త  టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్‌ నాడార్ (జూలై 14)  78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్‌-మేడ్‌ ఇండియన్‌ బిలియనీర్‌ శివ నాడార్‌  తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్‌ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్‌ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై  శివ నాడార్ ఫౌండేషన్‌, ఇతర  అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భూరి విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా.

ఎక్కడ పుట్టారు?
తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్.  కోయంబత్తూర్‌లోని పిఎస్‌జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్‌చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్‌లో కరియర్‌ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు. (జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్)

1975లో హెచ్‌సీఎల్‌ ఆవిర్భావం
ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్‌ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్‌తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది.

1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్‌ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఆవిష్కరించారు.

హెచ్‌సీఎల్‌ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ. 20 లక్షల అదనపు గ్రాంట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో  హెచ్‌సీఎల్‌టెక్‌ లిస్ట్‌ అయింది. 

తొలి పీసీ,  ఐటీ రంగంపై అంచనాలు
ఐబీఎం, యాపిల్‌ కంటే ముందే దేశంలో తొలి హెచ్‌సీఎల్‌ 8సీ  తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్‌ దక్కించుకున్నారు.  సొంత యాజమాన్య హార్డ్‌వేర్‌తో హార్డ్‌వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే  రూ. 10 లక్షల అమ్మకాలతో  1979 నాటికి రూ. 3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను  ప్రాధాన్యతను అప్పట్లోనే  పసిగట్టి, ఇందుకోసం సింగపూర్‌కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. (ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, 2022లో,  సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు  అని అంచనా. 2020లో  దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్‌గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక  కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు.  

శివసుబ్రమణ్య నాడార్ పేరుతో  పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్‌ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్‌ను స్థాపించాడు.
తండ్రికి తగ్గ కూతురిగా  రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం"  స్థాపించడం విశేషం. 

ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్  టాప్‌లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం  గొప్ప పరోపకారిగా నిలిచారు.  

Advertisement
Advertisement