Russia Ukraine War Impact On Stock Market: Experts Analysis On This Week Market - Sakshi
Sakshi News home page

Russia Ukraine War Impact: ఆర్‌బీఐ పాలసీ, ఆర్థిక గణాంకాలు కీలకం

Published Mon, Apr 4 2022 4:34 AM

Impact of Russia Ukraine War on Stock Market - Sakshi

ముంబై:  ద్రవ్య విధానంపై ఆర్‌బీఐ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ పరిణమాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపే ప్రధాన అంశాలుగా ఉన్నాయిని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్‌ వైరస్‌పైనా మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్‌ కదలికలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని భావిస్తున్నారు.

‘‘ప్రస్తుతానికి ట్రెండ్‌ బుల్స్‌కు అనుకూలంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి ఎలాంటి ప్రతికూల వార్తలు అందకపోతే మార్కెట్‌ మరింత కన్సాలిడేషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. వచ్చే వారంలో కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ప్రారంభం నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఈ వారంలో నిఫ్టీకి 17,725–17,800 కీలక స్థాయిలుగా ఉండనున్నాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశిస్తే 17,550–17,400 మద్దతు స్థాయిలుగా ఉంటాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ యశ్‌ షా తెలిపారు.

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ..., గడచిన వారంలో సూచీలు మూడుశాతం ర్యాలీ చేశాయి. ఆటో, బ్యాంక్, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఇన్ఫ్రా షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 1,914 పాయింట్లు, నిఫ్టీ 517 పాయింట్లు లాభపడ్డాయి. గరిష్ట స్థాయిల నుంచి క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, దేశీయ మార్కెట్లో ఎఫ్‌ఐఐల అమ్మకాల తీవ్రత తగ్గడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం, రష్యా ఉక్రెయిన్‌ చర్చల్లో పురోగతి తదితర పరిణామాలు సూచీల లాభాలకు కారణమయ్యాయి.  

మార్కెట్‌ను ప్రభావితం అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే....  
► ఆర్‌బీఐ పాలసీ సమావేశం  
ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమావేశం బుధవారం(ఏప్రిల్‌ 6న) ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ శుక్రవారం వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో పెరిగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు, క్రూడాయిల్‌ ధరల హెచ్చుతగ్గలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రణాళికల నేపథ్యంలో ఆర్‌బీఐ తీసుకొనే ద్రవ్య పాలసీ నిర్ణయాల కోసం మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాగే దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్‌బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.

► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
నేడు తయారీ రంగ డేటా, ఎల్లుండి(ఏప్రిల్‌ 6న) సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు విడుదల విడుదల కానున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, సేవా రంగ పనితీరును ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ వారాంతాన శుక్రవారం ఆర్‌బీఐ మార్చి 25 వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్‌ రుణ వృద్ధి గణాంకాలతో పాటు ఏప్రిల్‌ ఒకటవ వారంతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభా వం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు.  

► క్రూడాయిల్‌ కదలికలపై కన్ను  
ఇటీవల గరిష్టాలకు(120.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్‌ ధరలు దిగివస్తున్నాయి. అయితే ఇప్పటికీ బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లపైన ట్రేడ్‌ అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. క్రూడ్‌ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్‌ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని    చూపుతాయి.

ఆరో నెలలోనూ అమ్మకాలే
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా ఆరో నెలలోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు ఈ మార్చిలో రూ.41,000 కోట్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పాటు ఈ ఏడాది చివరిలోపు ఉద్దీపనలను ఉపసంహరించుకుంటామనే సంకేతాలతో ఎఫ్‌ఐఐలు వర్ధమాన దేశాల్లో విక్రయాలకు పాల్పడుతున్నారు. క్రూడాయిల్‌ ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో స్వల్పకాలం పాటు ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లు పరిమితంగా ఉండొచ్చు’’ అని మార్నింగ్‌స్టార్‌ ఇండియా డెరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

Advertisement
Advertisement