భార‌తీయుల‌కు శుభ‌వార్త‌!! మ‌న దేశంలో డిజిట‌ల్ క‌రెన్సీ వ‌చ్చేది అప్పుడే! | Sakshi
Sakshi News home page

భార‌తీయుల‌కు శుభ‌వార్త‌!! మ‌న దేశంలో డిజిట‌ల్ క‌రెన్సీ వ‌చ్చేది అప్పుడే!

Published Tue, Feb 8 2022 7:16 AM

India Digital Currency To Debut By Early 2023 - Sakshi

న్యూఢిల్లీ:దేశీయంగా అధికారిక డిజిటల్‌ కరెన్సీను వచ్చే ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రైవేట్‌ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్‌ వాలెట్ల తరహాలోనే ఉంటుందని, కాకపోతే ప్రభుత్వ హామీ కూడా ఉండటం దీని ప్రత్యేకతని వివరించాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసే ఈ కరెన్సీ యూనిట్లు .. అధికారిక భౌతిక కరెన్సీలాగే పరిమిత స్థాయిలోనే ఉంటాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘డిజిటల్‌ రూపీగా జారీ చేసే యూనిట్లను.. చెలామణీలో ఉన్న కరెన్సీ కేటగిరీలోనే చేరుస్తారు. ఇది పేపర్‌ కరెన్సీకి భిన్నమేమీ కాదు. కాకపోతే ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటుంది‘ అని పేర్కొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి (వచ్చే క్యాలండర్‌ ఏడాది తొలినాళ్లలో) ఇది సిద్ధమవుతుందని ఆర్‌బీఐ సూచనప్రాయంగా తెలిపినట్లు అధికారి వివరించారు.

ప్రస్తుత ఎలక్ట్రానిక్‌ మొబైల్‌ వాలెట్ల లావాదేవీల విషయానికొస్తే.. యూజర్లు ముందుగా ప్రైవేట్‌ కంపెనీకి తమ డబ్బును బదలాయిస్తే, ఆ తర్వాత సదరు సంస్థ ఆ మొత్తాన్ని అవతలి పక్షానికి బదలాయిస్తోందని పేర్కొన్నారు. ఇందుకు ఛార్జీలు కట్టాల్సి రావడంతో పాటు .. ఆయా ప్రైవేట్‌ సంస్థల ఆర్థిక రిస్కులను కూడా యూజరు భరించాల్సి ఉంటోందని అధికారి వివరించారు.

‘అదే డిజిటల్‌ రూపీ సంగతి తీసుకుంటే ..  మీ డబ్బు డిజిటల్‌ కరెన్సీ రూపంలో రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర ఉంటుంది. లావాదేవీలు జరిపినప్పుడు అదే చెల్లింపులు చేస్తుంది. దానికి ప్రభుత్వ హామీ ఉంటుంది‘ అని ఆయన వివరించారు. వివాదాస్పద క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత అధికారిక డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరెన్సీ వ్యవస్థను మరింత సమర్థమంతంగాను, చౌకగాను నిర్వహించుకునేందుకు కూడా డిజిటల్‌ కరెన్సీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.   
 

Advertisement
Advertisement