గణనీయంగా తగ్గిన పీఈ పెట్టుబడులు

15 Jan, 2023 08:18 IST|Sakshi

భారత కంపెనీల్లోకి గతేడాది 23.3 బిలియన్‌ డాలర్ల (రూ.1.91 లక్షల కోట్లు) ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయి.  అంతకుముందు ఏడాది పెట్టుబడులతో పోలిస్తే 42 శాతం తగ్గాయి. 2019లో వచ్చిన 15.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల తర్వాత మళ్లీ కనిష్ట స్థాయి గతేడాదే నమోదైంది. అయితే చారిత్రక సగటుతో పోలిస్తే మెరుగైన పెట్టుబడులు వచ్చనట్టేనని రెఫినిటివ్‌ సీనియర్‌ అనలిస్ట్‌ ఎలైన్‌ట్యాన్‌ పేర్కొన్నారు. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో 3.61 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

2022 సెప్టెంబర్‌ త్రైమాసికం గణాంకాలతో (3.93 బిలియన్‌ డార్లు) పోలిస్తే 8.1 శాతం తగ్గాయి. 2021 డిసెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన 11.06 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 67 శాతం తగ్గిపోయాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో 333 పీఈ పెట్టుబడుల డీల్స్‌ నమోదయ్యాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 443 డీల్స్‌తో పోలిస్తే 25 శాతం తగ్గాయి. 2021 డిసెంబర్‌లో పీఈ డీల్స్‌ 411గా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెరుగుదల, ఆర్థిక మాంద్యం ఆందోళనలు తదితర అంశాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసినట్టు ఎలైన్‌ట్యాన్‌ అభిప్రాయపడ్డారు.  

ఇంటర్నెట్‌–సాప్ట్‌వేర్‌ కంపెనీలకు ఆదరణ 
గతేడాది అత్యధిక పీఈ పెట్టుబడులను ఇంటర్నెట్‌ ఆధారిత, సాఫ్ట్‌వేర్, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాలు ఆకర్షించాయి. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగంలోని కంపెనీలు 2021తో పోలిస్తే రెట్టింపు పెట్టుబడులను రాబట్టాయి. చైనాలో అనిశ్చిత పరిస్థితులతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను డైవర్సిఫై చేస్తున్నారని.. ఇక ముందూ భారత్, దక్షిణాసియా దీన్నుంచి లాభపడతాయని ఎలైన్‌ట్యాన్‌ అంచనా వేశారు.

చదవండి: Maruti Suzuki Jimny: మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే
   

మరిన్ని వార్తలు