భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా

31 Jan, 2023 04:46 IST|Sakshi

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్‌ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్‌ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్‌ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్‌ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు.

రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్‌–వేరబుల్స్‌ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్‌ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో మొబైల్‌ ఫోన్‌ సెగ్మెంట్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.  2023–24లో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు