డిమాండ్‌కు భారత్‌ ‘ఇంధనం’ | Sakshi
Sakshi News home page

డిమాండ్‌కు భారత్‌ ‘ఇంధనం’

Published Tue, Oct 27 2020 4:39 AM

India will drive global energy demand Says PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో అంతర్జాతీయంగా వినియోగం పడిపోయిన తరుణాన .. ఇంధనానికి డిమాండ్‌ మళ్లీ పెరిగేందుకు భారత్‌ ఊతంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అంచనాలను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. ‘వచ్చే కొన్నేళ్ల పాటు అంతర్జాతీయంగా ఇంధనానికి డిమాండ్‌ తగ్గుతుందని పలు గ్లోబల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇంధన వినియోగంలో భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని కూడా అంచనా వేస్తున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే భారత్‌లో వినియోగం రెట్టింపు కానుంది. భారత ఇంధన భవిష్యత్తు ప్రకాశవంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఇదే ప్రపంచానికి శక్తినివ్వనుంది‘ అని సెరావీక్‌ నిర్వహిస్తున్న 4వ ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్‌ ప్రస్తుతం రోజూ 5 మిలియన్‌ బ్యారెళ్ల చమురు సరిసమాన ఇంధనాన్ని వినియోగిస్తోంది.

పారదర్శక విధానాలు ఉండాలి..
ఇంధనాలను సరఫరా చేసే దేశాలు ధరల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. ‘చాలాకాలంగా క్రూడ్‌ ధరలు భారీగా పెరగడం చూశాం. అలా కాకుండా ధరల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించే విధానాల వైపు మళ్లాలి. చమురు, గ్యాస్‌ విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యతనివ్వాలి‘ అని ఆయన సూచించారు. భారత ఏవియేషన్‌ మార్కెట్‌ అత్యంత వేగంగా ఎదుగుతోందని, 2024 నాటికి దేశీ విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇంధనం అందుబాటు ధరల్లో లభించాల్సి ఉందన్నారు.

వృద్ధికి ప్రాధాన్యం..
కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉంటూనే .. ఇంధన రంగంలో వృద్ధి సాధనపై భారత్‌ మరింతగా దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు. దేశీయంగా ఇంధన రంగం పరిశ్రమ, పర్యావరణానికి అనుకూల విధానాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాల్లో పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ మార్కెట్‌గా ఎదుగుతోందని వివరించారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని ముందుగా నిర్దేశించుకోగా .. కొత్తగా 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు. పారిశ్రామిక దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే దేశాల జాబితాలో భారత్‌ కూడా ఒకటని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలను ప్రధాని ప్రస్తావించారు. 100 శాతం విద్యుదీకరణ, ఎల్‌పీజీ కవరేజీని పెంచడం, 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ తదితర అంశాలను వివరించారు.

సీఈవోలతో భేటీ..
అంతర్జాతీయ ఇంధన దిగ్గజ సంస్థల అధినేతలతో ప్రధాని  మోదీ సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో పరిస్థితులు, చమురు.. ఇంధన రంగంలో పెట్టుబడులు తదిర అంశాలపై మేథోమథనం జరిపారు. రెండు గంటలపైగా ఈ సమావేశం కొనసాగింది. బ్రిటన్‌కు చెందిన బీపీ అధినేత బెర్నార్డ్‌ లూనీ, ఫ్రాన్స్‌ దిగ్గజం టోటల్‌ చైర్మన్‌ ప్యాట్రిక్‌ పొయాన్, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ సీఈవో ఇగోర్‌ సెచిన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇంధన రంగం భవిష్యత్‌ ముఖచిత్రంపై చర్చించారు.
 

Advertisement
Advertisement