పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. ఆటగాళ్లపై మండిపడ్డ భజ్జీ | Sakshi
Sakshi News home page

MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే!

Published Wed, Apr 3 2024 4:35 PM

Hardik Has Been Left Alone: Ex-India Star Blasts Big Personalities In Mumbai Indians

ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్‌మెంట్‌ నిర్ణయం ఏదైనా.. దానిని అంగీకరించాలని సూచించాడు. సమిష్టిగా ముందుకు వెళ్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని పేర్కొన్నాడు. 

జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు కెప్టెన్‌కు సహకరించాల్సిన అవసరం ఉందని భజ్జీ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్‌-2024 నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ చేసుకున్న ముంబై ఇండియన్స్‌ అతడిని కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.

ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మపై వేటు వేసి ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పాండ్యాను అవమానపరిచేలా హేళన చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

ఇక రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి సీనియర్‌ ఆటగాళ్ల పట్ల పాండ్యా వ్యవహరిస్తున్న తీరు వారి కోపాన్ని మరింత ఎక్కువ చేస్తోంది. అదే విధంగా.. పాండ్యా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడూ ఓడిపోవడం విమర్శలకు ఆస్కారం ఇచ్చింది.

ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో పరాజయం తర్వాత హార్దిక్‌ పాండ్యా ఒక్కడే డగౌట్‌లో కూర్చుని ఉండటం.. జట్టులోని విభేదాలను బయపెట్టింది. మిగతా ఆటగాళ్లంతా డ్రెసింగ్‌ రూంకి వెళ్లిపోగా పాండ్యా ఒంటరిగా అక్కడే ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. ‘‘ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో.. లేదంటే యాధృచ్చికంగా అలా జరుగుతుందో తెలియదు కానీ.. జట్టులోని చాలా మంది అతడిని కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు.

ముఖ్యంగా పెద్ద తలకాయలు.. కెప్టెన్‌గా పాండ్యా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థమవుతోంది. డ్రెసింగ్‌ రూం వాతావరణం కూడా సరిగ్గా లేనట్లు కనిపిస్తోంది. ఏ కెప్టెన్‌కు అయినా ఇలాంటివి కఠిన సవాళ్లే. 

ఆ విజువల్స్‌ అస్సలు బాగాలేవు. పాండ్యా ఒక్కడినే అలా వదిలేశారు. ఒక ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఆటగాళ్లు కెప్టెన్‌ తమ వాడే అని కచ్చితంగా అంగీకరించాలి. మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తే బాగుంటుంది.

ఈ ఫ్రాంఛైజీకి ఆడిన వ్యక్తిగా చెబుతున్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణం గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని భజ్జీ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2012లో ముంబై ఇండియన్స్‌కు హర్భజన్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

చదవండి: #Mayank Yadav: ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా మయాంక్‌ సంచలన రికార్డు

IFrame

Advertisement
Advertisement