పటిష్టంగా ఎకానమీ పునాదులు

4 Oct, 2021 00:20 IST|Sakshi

ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి

కోవిడ్‌–19ను సత్వరం అధిగమించాలి

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా స్పష్టం చేశారు.  గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వాస్తవ జీడీపీ గణాంకాలు.. కరోనా పూర్వ స్థాయిని అధిగమించడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కోవిడ్‌–19 మహమ్మారి సమస్యను సాధ్యమైన వేగంగా, నిర్మయాత్మకంగా దేశం అధిగమించాలని పనగారియా పేర్కొన్నారు. దేశీయంగా ప్రైవేట్‌ పెట్టుబడులు ఇప్పటికే పుంజుకున్నాయని ఆయన వివరించారు. మరోవైపు, సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఉపశమన ప్యాకేజీల (క్యూఈ) వల్లే భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

భారత్‌లోకి పెట్టుబడులకు క్యూఈతో పాటు అనేక కారణాలు ఉన్నాయన్నారు. ‘క్యూఈ అనేది సంపన్న దేశాల నుంచి ఇతర దేశాలకు పెట్టుబడులు మరలడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నిధులన్నీ ఇతర వర్ధమాన మార్కెట్లలోకి కాకుండా మొత్తం భారత్‌లోకే వస్తాయన్న హామీ లేదు. అత్యధికంగా రాబడులు వస్తాయన్న భరోసా కారణంగానే ఇన్వెస్టర్లు భారత్‌ను ఎంచుకుంటున్నారు‘ అని పనగారియా చెప్పారు. సంపన్న దేశాలు క్రమంగా ప్యాకేజీలను ఉపసంహరించే కొద్దీ పెట్టుబడుల్లో కొంత మొత్తం వెనక్కి వెళ్లడం సాధారణమేనన్నారు. అయితే, ఆయా సంపన్న దేశాల్లో వచ్చే రాబడులకన్నా ఎంత అధికంగా అందించగలదన్న అంశంపైనే భారత్‌లో పెట్టుబడుల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని పనగారియా చెప్పారు.  

హేతుబద్ధంగానే స్టాక్‌ మార్కెట్ల తీరు ..
వాస్తవ పరిస్థితులతో సంబంధం లేనట్లుగా ఆర్థిక వృద్ధి మందగించిన తరుణంలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లిపోతుండటం అసాధారణమేమీ కాకపోవచ్చని పనగారియా చెప్పారు. భవిష్యత్‌ రాబడుల అంచనాలపైనే స్టాక్‌ మార్కెట్‌ ధరలు ఆధారపడి ఉంటాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో షేర్ల రేట్ల విషయంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు హేతుబద్ధంగానే వ్యవహరిస్తున్నారని భావించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు