Indian Railways Introduced Better Amenities on Trains - Sakshi
Sakshi News home page

రైళ్లలో సూపర్‌ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!

Published Sat, Mar 11 2023 3:35 PM

Indian Railways Introduced Better Amenities in Trains - Sakshi

దేశంలో రైళ్లు.. కోట్లాది మందికి అనువైన ప్రయాణ సాధనాలు. ఇతర సాధనాలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే సౌకర్యాలు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టాయిలెట్‌ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కారణంగా వీటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులకు భారత రైల్వే శాఖ చెక్‌ పెడుతూ సరికొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది.

రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన  బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన బయో టాయిలెట్‌లతో కూడిన ఏసీ కోచ్‌ను రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత మిగతా రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపింది.

ముక్కు మూసుకోవాల్సిన పని లేదు!
రైల్వే శాఖ రూపొందించిన ఈ బయో టాయిలెట్లు ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అలాగే నీటి కొళాయిలు, సోప్‌ డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ అంటే సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. అయితే వీటిని దొంగిలించకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  వీటితో పాటు తలుపులు, గ్యాంగ్‌వేలను మెరుగు పరిచింది రైల్వే శాఖ. అసౌకర్యమైన టాయిలెట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది.

Advertisement
Advertisement