రియల్టీ మార్కెట్‌ భారీగా విస్తరణ: 2047 నాటికి | Sakshi
Sakshi News home page

రియల్టీ మార్కెట్‌ భారీగా విస్తరణ: 2047 నాటికి

Published Sat, Aug 26 2023 5:34 AM

Indian real estate market to grow 12 times by 2047 - Sakshi

న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ భారీగా విస్తరించనుంది. గతేడాది నాటికి ఈ మార్కెట్‌ 477 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 12 రెట్ల వృద్ధితో 5.8 లక్షల కోట్ల డాలర్లకు వృద్ధి చెందుతుందని నరెడ్కో–నైట్‌ఫ్రాంక్‌ నివేదిక తెలియజేసింది. ఇండియా రియల్‌ ఎస్టేట్‌: విజన్‌ 2047’ పేరుతో రియల్టర్ల మండలి నరెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. (మూన్‌పై ల్యాండ్‌ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!)

ప్రస్తుతం దేశ జీడీపీలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 7.3 శాతం వాటా కలిగి ఉండగా, 2047 నాటికి 15.5 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు (2047) దేశ జీడీపీ 33 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 40 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. నివాస గృహాల మార్కెట్‌ 299 బిలియన్‌ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. (అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?)

ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ విలువ 40 బిలియన్‌ డాలర్ల నుంచి 473 బిలియన్‌ డాలర్లకు, వేర్‌ హౌసింగ్‌ మార్కెట్‌ విలువ 2.9 బిలియన్‌ డాలర్ల నుంచి 34 బిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని వెల్లడించింది. 2023 సంవత్సంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు క్రితం ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి 5.6 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.  

భారీ అవకాశాలు
‘‘2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించడానికి రియల్‌ ఎస్టేట్‌ రంగం చేదోడుగా నిలవనుంది. ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు విస్తరించడంతో అది రియల్‌ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్‌కు ఊతమిస్తుంది. పెరుగుతున్న అవసరాలు, వినియోగానికి అనుగుణంగా ఎన్నో రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని నరెడ్కో ఇండియా ప్రెసిడెంట్‌ రాజన్‌ బండేల్కర్‌ వివరించారు.

ఆర్థిక వ్యవస్థలో అనుకూల వాతావరణం, మౌలిక రంగ వృద్ధి ప్రణాళికలు ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధికి దోహదపడతాయని నరెడ్కో వైస్‌ చైర్మన్‌ నిరంజన్‌ హిరనందానీ తెలిపారు. ‘‘వచ్చే 25 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎంతో రూపాంతరం చూడనున్నాం. అధిక జనాభా, మెరుగైన వ్యాపారం, పెట్టుబడుల వాతావరణం, తయారీ, ఇన్‌ఫ్రాకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అనుకూలతలు’’అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.

‘‘కరోనా తర్వాత హౌసింగ్‌ రంగం మరింత బలంగా, ఆరోగ్యంగా మారింది. విక్రయాలు బలంగా నమోదవుతున్నాయి. ధరలు పెరగడమే కాకుండా, అదే సమయంలో విక్రయం కాని యూనిట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌ రంగం బలాన్ని,  మెరుగైన భవిష్యత్తును తెలియజేస్తున్నాయి’’అని సిగ్నేచర్‌ గ్లోబల్‌ చైర్మన్‌ ప్రదీప్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement