2023లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే? | Sakshi
Sakshi News home page

2023లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే?

Published Tue, Jan 2 2024 8:54 AM

Institutional Investments In Indian Real Estate Recorded At 5.4 Billion - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా రియల్టీ రంగంలో గత క్యాలండర్‌ ఏడాది(2023) చివరి త్రైమాసికం(క్యూ4)లో సంస్థాగత పెట్టుబడులు 37 శాతం క్షీణించాయి. 82.23 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.

రియల్టీ రంగ కన్సల్టెంట్‌ ‘కొలియర్స్‌’ నివేదిక ప్రకారం అన్ని రకాల ఆస్తులలోనూ ఇవి కనిష్టంకాగా..అంతక్రితం ఏడాది(2022) ఇదే కాలం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో 129.94 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. కార్యాలయ విభాగంలో నిధులు 23 శాతం నీరసించి 13.55 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది క్యూ4లో 17.55 కోట్ల డాలర్లు లభించాయి. గృహ నిర్మాణ విభాగంలో మరింత అధికంగా 79 శాతం పడిపోయి 8.1 కోట్ల డాలర్లకు సంస్థాగత పెట్టుబడులు పరిమితమయ్యాయి. 2022 క్యూ4లో 37.91 కోట్ల డాలర్లు ప్రవహించడం గమనార్హం!  

ఆల్టర్నేట్‌ ఆస్తులు.. 
ప్రత్యామ్నాయ ఆస్తులు 11 శాతం తగ్గి 41.87 కోట్ల డాలర్లను తాకాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 46.79 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆల్టర్నేట్‌ ఆస్తులలో డేటా సెంటర్లు, లైఫ్‌ సైన్సెస్, సీనియర్‌ హౌసింగ్‌ హాలిడే హోమ్స్, విద్యార్ధుల గృహాలు, స్కూళ్లు తదితరాలున్నాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్‌ ఆస్తుల విభాగాలలో పెట్టుబడులు 16 శాతం వెనకడుగుతో 18.71 కోట్ల డాలర్లకు చేరగా.. 2022 క్యూ4లో 22.2 కోట్ల డాలర్ల నిధులను అందుకున్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు ఎలాంటి పెట్టుబడులు లభించకపోగా.. అంతక్రితం ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌లో 5.49 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. 

పెట్టుబడుల తీరిలా 
రియల్టీ రంగ పెట్టుబడులు చేపట్టే సంస్థాగత ఇన్వెస్టర్లలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్‌ గ్రూప్‌లు, విదేశీ బ్యాంకులు, ప్రొప్రయిటరీ బుక్స్, పెన్షన్‌ ఫండ్స్, ప్రయివేట్‌ ఈక్విటీ, రియల్టీ ఫండ్‌ కమ్‌ డెవలపర్స్, విదేశీ నిధుల ఎన్‌బీఎఫ్‌సీలు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ ఉన్నాయి. మొత్తంగా గతేడాది రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 10 శాతం వృద్ధితో 538.40 కోట్ల డాలర్లను తాకాయి.

2022లో ఇవి 487.79 కోట్ల డాలర్లు మాత్రమే. ఆఫీస్‌ విభాగం 302.25 కోట్ల డాలర్ల పెట్టుబడులు(53 శాతం వాటా)తో అగ్రపథాన నిలిచింది. 2022లో 197.83 కోట్ల డాలర్లు వచ్చాయి. హౌసింగ్‌ విభాగంలో 20 శాతం అధికంగా 78.89 కోట్ల డాలర్లు లభించగా.. అంతక్రితం 65.56 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్‌ ప్రాజెక్టులలో రెట్టింపై 87.76 కోట్లను తాకగా.. 2022లో కేవలం 42.18 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి.

ఇక ఆల్టర్నేట్‌ ఆస్తులలో పెట్టుబడులు 25 శాతం క్షీణించి 64.91 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం 86.67 కోట్ల డాలర్లు అందుకున్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు 91 శాతం తక్కువగా 4.23 కోట్ల డాలర్లు అందగా.. 2022లో 46.37 కోట్ల డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. 2023లో రిటైల్‌ ఆస్తులకు పెట్టుబడులు లభించకపోగా.. అంతక్రితం ఈ విభాగం 49.18 కోట్ల డాలర్లను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement