పేటీఎం విజయ్‌ శేఖర్‌ శర్మకు అంతర్జాతీయ గుర్తింపు

20 Jan, 2022 01:33 IST|Sakshi

న్యూఢిల్లీ: పేటీఎం వ్యవస్థాకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ అంతర్జాతీయంగా ముఖ్యమైన గ్రూపులో చోటు సంపాదించుకున్నారు. యూనివర్సల్‌ యాసెప్టెన్స్‌ స్టీరింగ్‌ గ్రూపు (యూఏఎస్‌జీ).. శర్మను యూఏ (యూనివర్సల్‌ యాసెప్టెన్స్‌) అంబాసిడర్‌గా నియమించింది. ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌ (ఐసీఏఎన్‌ఎన్‌) మద్దతుతో ఈ గ్రూపు పనిచేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ అవకాశం లేని భాషలకు సంబంధించి స్క్రిప్ట్‌లకు ప్రమాణాలను ఈ గ్రూపు సిఫారసు చేస్తుంటుంది. ‘డిజిటల్‌ ఇండియాను ముందుకు తీసుకెళ్లే బహుళ భాషల ఇంటర్నెట్‌ కోసం మేము కృషి చేస్తున్నాం.

భాషల పరంగా ఉన్న అడ్డంకిని ఛేదించాలన్నది మా ఆలోచన. ఇంగ్లీష్‌ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాం. విజయ్‌ వంటి నాయకుడు యూఏ అంబాసిడర్‌గా ఉండడం మాకు గౌరవం’ అని యూఏఎస్‌జీ చైర్‌పర్సన్‌ అజయ్‌ డాటా పేర్కొన్నారు.  ‘భారత్‌ విభిన్న బాషలకు నిలయం. భారతీయులకు వారికి సౌకర్యమైన భాషల్లో ఉత్పత్తులు, సేవలు అందించగలగడం మాకు గర్వకారణం. అందరికీ ఇంటర్నెట్‌ కోసం పనిచేసే యూఏతో కలసి పనిచేసే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది’ అని విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు