Layoffs In India: దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?

23 Nov, 2022 13:05 IST|Sakshi

ఉదయాన్నే ఆఫీసు కెళ్లిన మనిషి సాయంత్రానికి నిరుద్యోగి అయిపోయి ఇంటికి వస్తున్నాడు. మధ్యాహ్నం వరకు కంపెనీలో హుషారుగా ఉన్న వారు సాయంత్రానికి ఉద్యోగం పోయిన బాధతో ఏ బారుకో పోతున్నారు. దోమలను తోలేసినంత తేలిగ్గా కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఇంటికి తోలేస్తున్నాయి. ఐటీ రంగమంతటా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే వీటికి ఆజ్యం పోసింది మాత్రం  మస్కే. పాశ్చ్యాత్య దేశాల్లోని ఈ సంక్షోభం భారతీయ యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అన్న ఆందోళనలు వినపడుతున్నాయి.

ట్విటర్ బాస్   ఎలాన్‌  మస్క్‌ వచ్చీ రావడంతోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాడు. అమెజాన్, మెటా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశాయి. బైజూస్, నెట్ ప్లిక్స్, మైక్రోసాఫ్ట్,స్నాప్ కంపెనీలు ఎంత మంది ఉద్యోగాలకు శఠగోపం పెట్టచ్చా అని ఆలోచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఐటీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగాలు ఊడబీకే రుతువు మొదలైంది. కొద్ది నెలల పాటు ఈ ఉద్యోగ మేథం కొనసాగుతుంది. ఆర్ధికమాంద్యం తరుముకు వస్తోన్న నేపథ్యంలోనే ఉద్యోగాలు ఊడపీక్క తప్పడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. (మరో టెక్‌ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?)

ఎలాన్ మస్క్ ఏ ముహూర్తాన ట్విటర్ కంపెనీని సొంతం చేసుకున్నాడో కానీ అప్పట్నుంచే ఉద్యోగుల కుర్చీ కిందకు కుంపట్లు వచ్చి చేరాయి. కంపెనీ ఓనర్ గా సంస్థలో అడుగు పెట్టడానికి ముందే సంస్థలో సగానికి సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపేసేందుకుసిద్ధమయ్యారు మస్క్. అలా ఉద్యోగాలు పీకేయకపోతే కంపెనీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. వచ్చీ రావడంతోనే తనకు నచ్చని టాప్ బాసులను అవమానకరంగా ఇంటికి పంపిన మస్క్ ఆనందంతో ఓ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులను వేటాడ్డం మొదలు పెట్టారు. ఎంతమందిని పీకేయచ్చు? ఎవరెవరిని పీకేయాలి? అన్న కోణంలో కసరత్తులు మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఉద్యోగులందరికీ ఓ మెయిల్ పంపారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేస్తారా? లేకపోతే ఇళ్లకు పోతారా? అని బెదిరింపు ధోరణితో కూడిన ఏక వాక్య సందేశాన్ని పంపారు.

కష్టపడి పనిచేస్తామని ముందుకు వచ్చేవారికి ఒక ఫాం ఇచ్చి దాన్ని పూర్తి చేయించి సంతకం తీసుకోవాలన్నది మస్క్ ప్లాన్. అయితే ఆ ఫాంస్  పంపిణీ చేయడానికి ముందే ఉద్యోగులు మస్క్ వైఖరిపై మండిపోయారు. చీటికీ మాటికీ ఉద్యోగం పీకేస్తాను అనేవాడు ఏం బాస్? అటువంటి బాస్ దగ్గర పని చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత? అనుకున్న మెజారిటీ ఉద్యోగులు నువ్వూ వద్దు నీ ఉద్యోగమూ వద్దు నీకో దండం అనేసి సెల్యూట్ చేస్తోన్న ఎమోజీ ఒకటి పెట్టేసి ఊరుకున్నారు.

ఇక ట్విటర్‌లో అనుక్షణం భయపడుతూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు నిశ్చయానికి వచ్చేశారు. అందరూ ఉద్యోగాలు మానేయడానికి మూకుమ్మడిగా సిద్దమవుతున్నారన్న సమాచారం అందగానే మస్క్ లో కంగారు మొదలైంది. అందరూ వెళ్లిపోతే కంపెనీని నడిపెదెవరు? అన్న ఆలోచన రాగానే  ఇలాన్ మస్క్ దిద్దుబాటు చర్యలకు మొదలెట్టారు. ఉద్యోగుల్లో కొందరికి వర్క్ ఫ్రం హోం కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అన్నారు. మరి కొందరు కీలక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉద్యోగులు మాత్రం ఈ తాయిలాలకు లొంగేలా కనపడ్డం లేదు. బతికుంటే బలుసాకైనా తినచ్చు కానీ మస్క్ దగ్గర పనిచేయకూడదని నిర్ణయానికి వచ్చారు. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌: 10 వేలమంది ఇంటికే!)

ఉద్యోగాలు పీకేయడం అనేది ఇలాన్ మస్క్ ఒక్కరే చేస్తున్నది. కాదు. మస్క్ ఈ సంక్షోభంలో ఉండగానే  ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్  పదివేల మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధమైంది. ఎవరెవరికి పింక్ స్లిప్లులు ఇవ్వాలో జాబితాలు సిద్దం చేయిస్తోంది. ట్విటర్‌, అమెజాన్ లేనా తానేమన్నా తక్కువ తిన్నానా అనుకున్న  మెటా కంపెనీ అధినేత జుకర్ బర్గ్ 11 వేల మందిని అర్జంట్ గా ఇంటికి పంపేసి ఖర్చులు తగ్గించేసుకోవాలని డిసైడ్ అయిపోయారు.

మైక్రోసాఫ్ట్, యాపిల్, స్నాప్, సేల్స్ ఫోర్స్, లిఫ్ట్, స్ట్రైప్, బైజూస్ ,ఇంటెల్ వంటి టాప్ బ్రాండ్ ఐటీ కంపెనీలన్నీ కూడా   వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకోడానికి ఎంతో కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపాలన్న ఆలోచనతోనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఇపుడు ఇదే అతి పెద్ద సంక్షోభం. దీని ప్రభావం యువతపై తీవ్రంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వీధిన పడితే నిరుద్యోగ సమస్య వెక్కిరించడం ఖాయం. కొత్తగా ఐటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే నిపుణులకు అవకాశాలు దొరుకుతాయో లేదో తెలీని సందిగ్ధ పరిస్థితి.

ఇక దీని ప్రభావం భారత దేశంపై ఎలా ఉంటుందనే ఆందోళన తీవ్రమవుతోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఐటీ రంగంలో అడుగుపెట్టే నిపుణులు ఎక్కువ సంఖ్యలో ఉండేది భారత్ నుంచే. చాలా దేశాలకు భారతీయ యువతే చీప్ లేబర్. అంతే కాదు భారతీయులే ఈ రంగంలో తిరుగులేని నైపుణ్యాలతో రాణించడమే కాకుండా కష్టపడి పనిచేస్తారన్న  పేరూ ఉంది. అందుకే ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తే వణికించవచ్చు కానీ ఇది పరోక్షంగా భారతీయులకు వరమే అవుతుందని నిపుణులు అంటున్నారు. కాకపోతే భారతీయ ఐటీ కంపెనీలకు మాత్రం కాస్త కష్టాలు తప్పకపోవచ్చు. ఎందుకంటే మన ఐటీ కంపెనీలకు బిజినెస్ ఇచ్చేదే అమెరికా కంపెనీలు. ఆ కంపెనీలే సంక్షోభంలో ఉంటే దానికి అనుగుణంగా మన ఐటీ కంపెనీలకు వచ్చే బిజినెస్సూ తగ్గుతుంది. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఇంతకీ ఎందుకీ సంక్షోభం? ఎందుకిలా ఉన్నట్లుండి ఓ సీజన్ మొదలైనట్లు ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నారు.? దీనికి బీజం 2020 ఆరంభంలోనే పడింది. ప్రపంచం మొత్తాన్ని గడ గడ లాడించిన కరోనా మహమ్మారి  అన్ని రకాల వ్యవస్థలనూ చితక్కొట్టేసింది. ఆర్ధిక వ్యవస్థలయితే మరీ ఘోరంగా దెబ్బతినేశాయి. అప్పుడే వేలాది కంపెనీలు మూత పడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఆర్ధిక మాంద్యం అందరికీ నరకం చూపించింది. రెండేళ్ల పాటు దుర్భర పరిస్థితులే తిష్ట వేశాయి. కరోనా నుండి ప్రపంచం అయితే బయట పడింది. కాకపోతే కరోనా చావుదెబ్బ తీసిన వ్యవస్థలు మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇపుడిపుడే నెమ్మదిగా ఒక్కో వ్యవస్థా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఈ దశలోనే మరో ఆర్ధిక మాంద్యం తరుముకు వస్తోంది.

ప్రపంచాన్ని భయపెట్టడానికి 2023లో మరో ఆర్ధిక మాంద్యం రాబోతోందన్నది ఆర్ధిక వేత్తల అంచనా. అది కనీసం ఎనిమిది నెలల పాటు పట్టి పీడిస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా వ్యాపారాలు లేక లాభాలు ఆవిరైపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతోన్న సంస్థలకు ఆర్ధిక మాంద్యం పేరు చెబితేనే వణుకు పుడుతోంది. అందుకే కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు అంతా. అంటే  ఉన్నంతలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనుకున్నారు. అనవసర ఖర్చుల్లో కంపెనీలకు ముందుగా కనిపించేవి  అదనపు ఉద్యోగులే.  తమ దగ్గర పనిచేస్తోన్న ఉద్యోగుల్లో ఎంతమందికి చేతి నిండా పని ఉంది? ఎందరు పనిలేక కాలక్షేపం చేస్తున్నారు? అన్నది చూస్తారు. ఒక వేళ అందరికీ చేతి నిండా పని ఉన్నా అందులో నాణ్యమైన పని చేసేవాళ్లు ఎంత మంది?  నామమాత్రంగా పని చేశామంటే చేశాం అనిపించుకునే వాళ్లు ఎంతమంది? అన్న అంశంపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత వారిలో ఎంతమందిపై వేటు వేస్తే ఎంత ఖర్చు తగ్గుతుంది? సంస్థకు ఎంత ఆదా అవుతుంది? అన్నది చూస్తారు. ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాతనే  ఉద్యోగాలు ఊడబీకే పనిలో పడతారు. మస్క్ కంపెనీ తన చేతికి రాకముందే సగానికి పైగా ఉద్యోగులను తీసేయాలని ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. వచ్చే ఆర్ధిక మాంద్యం ఎనిమిది నెలలే ఉంటుందా?  లేక ఆ తర్వాత అది మరి కాస్త ముదురుతుందా అన్నది ఇపుడే చెప్పలేం. కాకపోతే ఆర్ధిక వేత్తలు గత అనుభవాల ఆధారంగా వేసుకున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల కంటే మాంద్యం ఉండే అవకాశాలు లేవంటున్నారు. కాలం కలిసొస్తే ఎనిమిది నెలల లోపే సంక్షోభం కనుమరుగు కావచ్చునని కూడా అంటున్నారు. (Twitter Hirings: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్‌,ఇండియన్‌ టెకీలకు గుడ్‌ న్యూస్‌)

ఆ పరిస్థితి వచ్చే వరకు ఐటీ కంపెనీలే కాదు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి అంతంత మాత్రంగా వ్యాపారాలు చేస్తోన్న ప్రతీ ఒక్కరూ  ఉద్యోగుల మెడపై కత్తులు వేలాడదీయడం ఖాయం అంటున్నారు మేథావులు. సంక్షోభం ముగిశాక మళ్లీ  పెద్ద సంఖ్యలో మానవవనరులు అవసరం కాగానే కంపెనీలు రిక్రూట్ మెంట్ల వైపు మొగ్గు చూపుతాయి. అంటే చేతిలో పని రాగానే ఉద్యోగులను నియమించుకుంటారు. వ్యాపారం తగ్గిన తర్వాత ఉన్న ఉద్యోగులపై వేటు వేస్తారు. సరఫరాకీ డిమాండ్ కీ మద్య ఉన్న సంబంధమే  కంపెనీల్లో ఉద్యోగుల హైరింగ్ కూ ఫైరింగ్ కూ మధ్య ఉంటుందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. (బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు: మరోసారి బ్రేక్‌, ఎందుకంటే?)

అమెరికా వంటి దేశంలో ప్రస్తుతం మొదలైన సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇంటికి వెళ్లక తప్పదు. వారికి కొత్తగా ఉద్యోగాలు దొరకాలంటే  చాలా కష్టం. బాగా నైపుణ్యాలు ఉన్న కొద్ది మందికి ఎక్కడో ఒక చోట దొరకచ్చుకానీ ఓ మాదిరి నైపుణ్యాలతో కాలక్షేపం చేసేవారికి అంత ఈజీగా ఉద్యోగాలు దొరకవంటున్నారు నిపుణులు. మస్క్ భారత దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పోయే వారి భవిష్యత్ కొద్ది నెలల పాటు చీకటే.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొత్తగా పట్టభద్రులైన వారిల ప్రస్తుత ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఫ్రష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు అంత తేలిగ్గా రావంటున్నారు  నిపుణులు. ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి లేనపుడు వీసాలూ కష్టమవుతాయి. ఇది భారత్ వంటి  దేశాలపై ప్రభావం చూపచ్చు. కాకపోతే అది కలకాలం ఉండదంటున్నారు. ఈ సంక్షోభం నుండి అందరికన్నా ముందుగా బయటపడేది దీన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేది భారత్ ఒక్కటే అంటున్నారు.

పాశ్చ్యాత్య దేశాల్లో  నెలకొన్న సంక్షోభం భారతీయ యువతకు ఒక విధంగా వరమే అంటున్నారు మేథావులు. అమెరికా వంటి దేశాల్లో ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగులను ఇంటికి పంపుతోన్న కంపెనీలు తక్కువ వేతనాలకు దొరికే భారతీయ యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు అన్ని వ్యవస్థలనూ నమిలేయడం వల్లనే సంక్షోభం  వెంటాడుతోందని మేథావులు అంటున్నారు. దీన్నుంచి పూర్తిగా బయట పడ్డానికి మరో అయిదేళ్లుకు పైనే పట్టచ్చన్నది వారి అంచనా. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలలూ ఈ సంక్షోభం ఉండచ్చంటున్నారు నిపుణులు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగ మేళాలు పెద్ద ఎత్తున పుంజుకనే అవకాశాలుంటాయని వారు అంచనా వేస్తున్నారు.

-సీఎన్‌ఎస్‌ యాజులు, కన్సల్టింగ్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

మరిన్ని వార్తలు