చైనా మీదే జోక్‌.. భారీ డ్యామేజ్‌ భయంతో ముందే క్షమాపణలు!

25 Nov, 2021 14:40 IST|Sakshi

JPMorgan CEO Comments On China: ‘కమ్యూనిస్ట్‌ పార్టీ కంటే మా బ్యాంక్‌ దీర్ఘకాలం కొనసాగుతుంది.. కావాలంటే పందెం’ అంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన జేపీ మోర్గాన్‌​ సీఈవో జేమీ డిమోన్‌ ఆపై నాలిక కర్చుకున్నాడు. భారీ నష్టం జరగక ముందే తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. 


మంగళవారం బోస్టన్‌ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌లో  డిమోన్‌ మాట్లాడుతూ.. నేను హాంకాంగ్‌లో ఉన్నా. అప్పుడు ఓ జోక్‌ చేశా. కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాలు చేస్తోంది. జేపీ మోర్గాన్ కూడా అంతే. కానీ, మేం వాళ్ల (కమ్యూనిస్ట్‌ పార్టీ) కంటే ఎక్కువ కాలం ఉంటామని పందెం కాస్తాను. ఇదే మాట నేను చైనాలో చెప్పలేను. అయినా వాళ్లు నా మాటలు వింటున్నారు’’ అంటూ మంగళవారం బోస్టన్ ఈవెంట్‌లో వ్యాఖ్యలు చేశాడు. 

అమెరికా అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజమైన జేపీ మోర్గాన్‌ చేజ్‌.. ఆగష్టులో చైనా రెగ్యులేటరీ నుంచి నుంచి సెక్యూరిటీ బ్రోకరేజ్‌కు అనుమతులు దక్కించుకుంది. తద్వారా చైనా నేలపై ఆధిపత్యం ఆలోచనకు అడుగేసింది. ఈ తరుణంలో డిమోన్‌ తాజా వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు కమ్యూనిస్ట్‌ పార్టీని ఆగ్రహానికి గురి చేయడంతో పాటు చైనాలో అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్‌ కొంప ముంచే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అయ్యింది. అందుకే 18 గంటలు గడవకముందే డిమోన్‌ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. దీంతో వ్యవహారం సర్దుమణిగినట్లేనని అంతా భావిస్తున్నారు.

మరోవైపు డిమోన్‌కు ఇలా నోరు జారడం కొత్తేం కాదు.  2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ మీదే ఏకంగా కామెంట్లు చేశాడు. ట్రంప్‌ కంటే తానే దమ్మునోడినని, అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఓడించి తీరతానని కామెంట్లు చేశాడు. ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని క్షమాపణలు చెప్పాడు.

చదవండి: జేపీ మోర్గాన్‌ వర్సెస్‌ ఎలన్‌ మస్క్‌.. సిల్లీ కామెడీ! 

మరిన్ని వార్తలు