పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ప్రీ-ఫిల్డ్‌ ఫారంలు వచ్చేశాయి

10 May, 2021 14:26 IST|Sakshi

ఆదాయపు పన్ను శాఖ వారు సంస్కరణల పేరిట తీసుకొచ్చిన పెనుమార్పుల్లో కొత్త ఫారంలు కూడా ఉన్నాయి. వీటినే ప్రీ ఫిల్డ్‌ ఫారంలని కూడా అంటారు. కొత్త మార్పుల కారణంగా మనం సైటులోకి వెళ్లి ఫారంలోని ఒక్కొక్క అంశం టైప్‌ చేసి నింపాల్సిన అవసరం లేకుండా.. డౌన్‌లోడ్‌ చేసేసరికే ఫారంలో అంశాలు నింపేసి ఉంటాయి. అంటే డిపార్ట్‌మెంట్‌ సిబ్బందే మనకు సంబంధించిన వివరాలను ఫారంలో పొందుపర్చి ఉంచుతారు. మీరు వాటిని సరిచూసుకుని, సరిగ్గానే ఉన్నట్లయితే ఒక్క క్లిక్‌తో ఫారంను ఫైల్‌ చేయొచ్చు. 

ఒకవేళ సరిపోలకపోయిన పక్షంలో సదరు అంశాలను మీ లెక్కల ప్రకారం సవరించి, రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఈ విధానాన్ని 2019 నుంచి పాక్షికంగా ప్రవేశపెట్టగా.. ఈ సంవత్సరం నుంచి సమగ్రమైన వివరాలతో పూర్తి స్థాయిలో అమలు కాగలదని విశ్లేషకుల అంచనా. డిపార్ట్‌మెంట్‌ దగ్గర మన ఆదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. డిపార్ట్‌మెంట్‌ ఏం చెబుతోందంటే.. 

 • ఈ ఫారంలు నింపటం చాలా సులువు. చాలా త్వరగా నింపవచ్చు. 
 • పారదర్శకత మెరుగుపడుతుంది. 
 • ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. 
 • సమగ్రమైన సమాచారం కలిగి ఉంటుంది. 
 • చట్టాలకు అనుగుణంగా పని త్వరగా పూర్తవుతుంది. 
 • తప్పులకు ఆస్కారం ఉండదు. 
 • పన్నుల ఎగవేత తగ్గుతుంది. 

పైన పేర్కొన్న ప్రయోజనాలతో అంతా ఏకీభవించక తప్పదు. ఆదాయపు పన్ను శాఖ ఆలోచన అలాగే ఉంటుంది. ఎందుకంటే, ఎన్నో ఆర్థిక వ్యవహరాలు జరుగుతున్నా .. అసెసీలు వాటిని తమ తమ వార్షిక రిటర్నులలో చూపించడం లేదు. నిజాయితీగా ఆదాయం, ఆర్థిక వ్యవహారాలను చూపించని బడాబాబులు ఎందరో ఉంటారు. ఈ విషయం అలా ఉంచితే.. మీరు చేయవలసిందేమిటంటే.. 

 • మీ పేరు మీదనున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలను పరిగణనలోకి తీసుకోండి. 
 • అన్ని ఆదాయాలు .. జీతం, ఇంటద్దె, లాభాలు, క్యాపిటల్‌ గెయిన్స్, వడ్డీ, డివిడెండ్లు మొదలైనవన్నీ లెక్కలోకి తీసుకోండి. 
 • ప్రతి లావాదేవీకి వివరణ, కాగితాలను సమకూర్చుకోండి. 
 • ఫారం నింపే ముందు ఫారం 16, 16ఎ, 26ఏఎస్‌ మొదలైనవన్నీ పరిశీలించి చూసుకోండి. 
 • అంశాల్లో అంకెలు సరిపోలకపోతే... అంటే మిస్‌ మ్యాచ్‌ అయితే.. సరిచేసుకోండి. ప్రతీ మార్పు, చేర్పునకు వివరణ ఉంచుకోండి. 
 • అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి.  

ఇక, ఈ ప్రీ-ఫిల్డ్‌ ఫారంలలో కొన్ని సమస్యలు కూడా ఉంటున్నాయి. అవేంటంటే.. 

 • అంకెలు సరిపోలకపోవడం.. మిస్‌ మ్యాచ్‌ 
 • కేవలం టీడీఎస్‌ వివరాలు ఉంటున్నాయి. ఆదాయ వివరాలు ఉండటం లేదు. 
 • క్లోజ్‌ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా పొందుపర్చి ఉంటున్నాయి. 

కాబట్టి .. ఇలాంటివన్నీ చూసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుని రిటర్నులు దాఖలు చేయాలి.

ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య

మరిన్ని వార్తలు