భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ..

Published Sat, Jan 13 2024 7:50 PM

Lack Of Experts In Quantum Computing Technology  - Sakshi

ప్రస్తుతకాలంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు! ఏఐనే మన జీవితాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రభావం చూపుతోంది. అలాంటిది ఏఐ కంటే ఎన్నోరెట్లు ఎక్కువ సమర్థతో పనిచేసే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రభంజనమే. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లు కలిసి ​కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. దాంతో దేశాల మధ్య పోటీ మొదలైంది.

కెనడా, అమెరికాల తరువాత సొంతంగా క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారు చేసిన ఘనత ఇటీవలే చైనా సొంతం చేసుకుంది. 2026 నాటికి భారత్‌ 50 క్యుబిట్ల సామర్థ్యంతో సొంత క్వాంటమ్‌ కంప్యూటర్‌ను రూపొందిస్తుందని నాస్కామ్‌ అంచనా. దానికన్నా ముందు క్వాంటమ్‌ సిమ్యులేటర్లు, సెన్సర్ల తయారీకి భారత్‌ సమాయత్తమవుతోంది. క్వాంటమ్‌ రంగంలో అగ్రశక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో క్వాంటమ్‌ ఆధారిత సైన్స్‌, టెక్నాలజీ (క్వెస్ట్‌) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భవిష్యత్తులో ఇలా..

క్వాంటమ్‌ పథకం కింద 2023-31 మధ్య కాలంలో సంబంధిత కంప్యూటర్‌ ప్రాసెసర్లు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రూపకల్పన, నిపుణులైన మానవ వనరులను తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరోగ్య సంరక్షణ, భూగర్భ వనరుల అన్వేషణ, ఉపగ్రహ కమ్యూనికేషన్ల కోసం క్వాంటమ్‌ సెన్సర్లు తయారు చేస్తారు. భూ, వాయు, జల, అంతరిక్ష మార్గాల్లో ప్రయాణాల కోసం క్వాంటమ్‌ నావిగేషన్‌ సాధనాలను రూపొందిస్తారు. క్వాంటమ్‌ సాంకేతికతలు దేశ భద్రత, బ్యాంకింగ్‌ రంగానికి మెరుగైన కమ్యూనికేషన్‌ అందిస్తాయని అభిప్రాయాలు ఉన్నాయి. క్వాంటమ్‌ సాధనాల తయారీకి కావాల్సిన సూపర్‌, సెమీ కండక్టర్లు, రకరకాల లోహ మిశ్రమాలను భారత్‌ సొంతంగా తయారుచేసుకుంటోంది.

2035కల్లా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ రాబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష-వైమానిక, ఆటోమోటివ్‌, ఫైనాన్స్‌, ఫార్మా వంటి వివిధ రంగాలకు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అత్యంత వేగవంతమైన సమాచార ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ద్వారా ప్రస్తుత ఎన్‌క్రిప్షన్‌ పద్ధతులను ఛేదించే వీలుంది. దీంతో అత్యంత సునిశిత సెన్సర్లను  రూపొందించవచ్చు. ఇవి ప్రత్యర్థి సైనిక, ఆర్థిక, కార్పొరేట్‌, ప్రభుత్వ కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయగలవు. పేటెంట్ల నమోదు, క్వాంటమ్‌ కమ్యూనికేషన్లలో చైనా అమెరికాను మించిపోయింది. భూమి నుంచి అంతరిక్షానికి కమ్యూనికేషన్‌ యంత్రాంగ నిర్మాణం కోసం అనేక క్వాంటమ్‌ నానో ఉపగ్రహాలను ప్రయోగించింది. ప్రత్యర్థుల రాడార్లకు చిక్కని స్టెల్త్‌ జలాంతర్గాములు, యుద్ధవిమానాలను పసిగట్టే క్వాంటమ్‌ ఆధారిత రాడార్‌నూ చైనా రూపొందించింది.

ఇదీ చదవండి: ఒకే బ్యాంకులో వచ్చే రెండేళ్లలో 20 వేలకు పైగా లేఆఫ్స్‌..!

నిపుణులు కరవు..

ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చాలా కొద్ది వర్సిటీలు మాత్రమే క్వాంటమ్‌ సైన్స్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికీ క్వాంటమ్‌ రంగం కోసం ప్రత్యేక నిపుణులెవరూ తయారు కాలేదు. 2021లో ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్‌ సాంకేతికతలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు దాదాపు 851 మాత్రమే. ఆ రంగంలో ప్రపంచమంతటా పట్టభద్రులైనవారు కేవలం 290 మందే. నిపుణుల కొరతను తీర్చడానికి ప్రస్తుతం భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజినీర్లే క్వాంటమ్‌ పరిశోధకుల అవతారం దాలుస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీలో నిపుణుల కొరతపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement