ఎల్‌ఐసీ అమ్మక పరిమాణం ఓకే | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ అమ్మక పరిమాణం ఓకే

Published Thu, Apr 28 2022 4:02 AM

LIC IPO to be biggest in India despite reduced offer size - Sakshi

ముంబై: పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్‌ వాతావరణంలో ఎల్‌ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్‌ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు.

వెరసి ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్‌ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్‌ఐసీ.. మే 17న స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు మార్కెట్‌ వర్గాల అంచనా.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement