తొలుత 540 ప్లస్‌- చివర్లో 1100 మైనస్‌ | Sakshi
Sakshi News home page

తొలుత 540 ప్లస్‌- చివర్లో 1100 మైనస్‌

Published Mon, Aug 31 2020 4:11 PM

Market plunges in high volatile session - Sakshi

తూర్పు లడఖ్‌ ప్రాంతంలో చైనా సైనిక బలగాలు తిరిగి 'హద్దు' మీరినట్లు వెలువడిన వార్తలు దేశీ స్టాక్‌ మార్కెట్లపై పిడుగులా పడ్డాయి. దీంతో వరుసగా ఆరో రోజు హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు ఉన్నట్లుండి కుప్పకూలాయి. ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 839 పాయింట్లు పతనమై 38,628 వద్ద నిలవగా.. నిఫ్టీ 195 పాయింట్లు కోల్పోయి 11,452 వద్ద ముగిసింది. అయితే ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో సెన్సెక్స్‌ తొలుత 540 పాయింట్లకుపైగా జంప్‌చేసి 40,010 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ స్థాయి నుంచి అమ్మకాలు వెల్లువెత్తడంతో 38,396 దిగువకు పడిపోయింది. వెరసి ఇంట్రడే గరిష్టం నుంచి 1,600పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,794 వద్ద గరిష్టాన్ని తాకగా..  11,326 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. లడఖ్‌ తూర్పు ప్రాంతంలో తిరిగి చైనా బలగాలతో సైనిక వివాదం తలెత్తినట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఆరు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు.

2 షేర్లు మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మీడియా, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ, ఐటీ 6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ(1.6 శాతం), టీసీఎస్‌(0.7 శాతం) మాత్రమే లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇతర బ్లూచిప్స్‌లో సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, సిప్లా, బజాజ్‌ ఫిన్‌, జీ, ఎన్‌టీపీసీ,  ఇండస్‌ఇండ్‌,  ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీ సిమెంట్‌, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ 7.3-4 శాతం మధ్య నష్టపోయాయి. 

పతన బాటలో
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌ఎండీసీ, పిరమల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, డీఎల్‌ఎఫ్‌, పీవీఆర్‌, జీఎంఆర్‌, బాష్‌, ఐబీ హౌసింగ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, అపోలో టైర్‌, భెల్, కెనరా బ్యాంక్‌, అరబిందో, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, చోళమండలం, మెక్‌డోవెల్‌, ఐసీఐసీఐ ప్రు 10-6.5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. కేవలం ఇండిగో, ఐడియా మాత్రమే అదికూడా 0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో  మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 4-4.5 శాతం చొప్పున పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 2,329 నష్టపోగా... కేవలం 536 లాభాలతో నిలిచాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1004 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 544 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,164 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 809 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.  

Advertisement
Advertisement