M&M Q2 Results: Profit grows 46% YoY to Rs 2,090 crore
Sakshi News home page

ఎస్‌యూవీల జోరు.. లాభాల్లో మహీంద్రా

Published Sat, Nov 12 2022 7:01 AM

M&m Q2 Results: Profit Grows To Rs 2,090 Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 44% జంప్‌చేసి రూ. 2,773 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ.1,929 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు ఎగసింది. ఆటోమోటివ్‌ విభాగం టర్నోవర్‌ రూ.8,245 కోట్ల నుంచి రూ.15,231 కోట్లకు దూసుకెళ్లగా.. వ్యవసాయ పరికరాల బిజినెస్‌ రూ. 6,723 కోట్ల నుంచి రూ.7,506 కోట్లకు బలపడింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.2,974 కోట్లకు చేరింది. 

ఎస్‌యూవీల జోరు: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎం అండ్‌ ఎం స్టాండెలోన్‌ నికర లాభం 46% జంప్‌చేసి రూ. 2,090 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 57% వృద్ధితో రూ. 20,839 కోట్లకు చేరింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 75% దూసుకెళ్లి 1,74,098 యూనిట్లను తాకగా, ట్రాక్టర్ల అమ్మకాలు 5% బలపడి 92,590కు చేరాయి. ఎక్స్‌యూవీ 700, స్కార్పియో–ఎన్‌ వాహనాలకు  భారీ డిమాండ్‌ వలకల వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ ఈడీ రాజేష్‌ జెజూరికర్‌ చెప్పారు.

ఈ ఏడాది చివరికల్లా ఎస్‌యూవీ తయారీ సామ ర్థ్యాన్ని నెలకు 39,000 యూనిట్లకు, తదుపరి వచ్చే ఏడాది చివరికల్లా 49,000 యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 2.6 లక్షల యూనిట్లకు బుకింగ్స్‌ ఉన్నట్లు తెలియజేశారు. 2027కల్లా ఎస్‌యూవీల అమ్మకాలలో 20–30 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలు ఆక్రమించవచ్చని అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు 0.8% నీరసించి రూ. 1,287 వద్ద ముగిసింది.
 

Advertisement
Advertisement