Sakshi News home page

‘ఆఫీసుకు వస్తారా.. కంపెనీ వదిలేస్తారా?’ .. ఉద్యోగులకు టెక్‌ దిగ్గజం ‘ఐబీఎం’ అల్టిమేట్టం!

Published Tue, Jan 30 2024 4:21 PM

Move Near Office Or Leave Job: IBM Issued A Memo To US Managers - Sakshi

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) సీఈఓ అరవింద్ కృష్ణ ఉద్యోగుల‌కు అల్టిమేట్టం జారీ చేశారు. వ‌ర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది ఆఫీస్‌కు రావాలని, లేదంటే సంస్థను వదిలేయాలని సూచించారు. 

అమెరికాలో విధులు నిర్వ‌హిస్తున్న మేనేజర్లకు, హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి జనవరి 16న ఐబీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్ గ్రాంజెర్ ఓ ఇంటర్నల్‌ మెయిల్‌ పంపారు. అందులో ‘ప్ర‌స్తుతం మీరు ఎక్క‌డ ప‌నిచేస్తున్నారో సంబంధం లేకుండా ఆఫీస్ లేదా క్ల‌యింట్ లొకేష‌న్‌లో క‌నీసం వారానికి మూడు రోజులు విధులు నిర్వ‌హించాల‌ని’ మెయిల్‌లో పేర్కొన్నట్లు మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఆఫీస్‌కు వస్తారా? రాజీనామా చేస్తారా?  
ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి 80 కిలోమీటర్ల లోపు ఇంటి వద్ద నుంచి ఉద్యోగులు స్థానిక ఐబీఎం కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు, లేదంటే మిలటరీ సర్వీసుల్లో పనిచేస్తున్న ఐబీఎం ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ రిమోట్‌గా పనిచేస్తున్న మేనేజర్లు క్లయింట్‌ లొకషన్‌ లేదంటే లోకల్‌ ఆఫీస్‌కు వచ్చేందుకు అంగీకరించకపోతే ఐబీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుందని గ్రాంజర్‌ స్పష్టం చేశారు.  

వారానికి మూడు రోజులు
ఈ సందర్భంగా మరింత ప్రొడక్టివిటీ, క్లయింట్‌లకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. కాబట్టే ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి కాకుండా నేరుగా కార్యాలయాల్లో, క్లయింట్‌లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసే వాతావరణాన్ని రూపొందించడంపై దృష్టిసారించినట్లు ఐబీఎం ప్రతినిధి తెలిపారు. ఈ విధానానికి అనుగుణంగా అమెరికాలోని ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్‌లు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌ నుంచి పనిచేయాలని మేం కోరుతున్నాము’ అని అన్నారు. 

కృత్తిమ మేధపై దృష్టి
ఐబీఎం ఇటీవలి కాలంలో సాఫ్ట్‌వేర్, సేవలపై దృష్టి తగ్గించింది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కృత్తిమ మేధకు సంబంధించిన ప్రొడక్ట్‌లను మార్కెట్‌కి పరిచయం చేసింది. అదే సమయంలో గత ఏడాది జనవరిలో 3,900 మందికి లేఆఫ్స్‌ ఇచ్చింది. ఈ ఏడాది సైతం వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించే పనిలో పడిందని సమాచారం. వారికి అందించే వేతనాన్ని సంస్థ పునర్వ్యవస్థీకరణకు ఖర్చు చేస్తుందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ చెప్పారు. 



ఇతర కంపెనీల దారిలో ఐబీఎం

2022 చివరి నాటికి ఐబీఎంలో ప్రపంచ వ్యాప్తంగా 288,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ కల్పించింది. తిరిగి ఇప్పుడు రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాలని కోరుతుంది. ఇలా ఐబీఎంతో పాటు పలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. అందుకు భారీగా ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. తిరస్కరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాయి.  

వర్క్‌ ఫ్రం హోమ్‌తో ప్రమోషన్లు కష్టం
ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ ఆఫీస్‌ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి హైలెట్‌ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది మేలో బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్‌సైట్‌లో లేని వారికి ప్రమోషన్‌లు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ఐబీఎంలోని కొన్ని బృందాలు ఇప్పటికే ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

Advertisement
Advertisement