Sakshi News home page

RRR Movie : జోష్‌ నింపిన ఆర్‌ఆర్‌ఆర్‌.. దిల్‌కుష్‌లో మల్టీప్లెక్సులు

Published Sat, Mar 26 2022 3:34 PM

Multiplex Theatre Shares Hiked Amid Big Budget Movie Release - Sakshi

ముంబై: కొద్ది నెలలుగా భారత్‌సహా ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నీరసించడంతో ఆంక్షలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా ఏప్రిల్‌ 1 నుంచి మాస్క్, సామాజిక దూరం మినహా పలు ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో  ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమకు తిరిగి జోష్‌ వచ్చింది. ఓవైపు ఓటీటీ విభాగం పుంజుకోవడం, మరోపక్క భారీ బడ్జెట్‌ సినిమాల విడుదల కారణంగా మళ్లీ మల్టీప్లెక్స్‌ రంగం కళకళలాడుతోంది. 

ఊపు తెచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌
దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటోంది. సినిమా శుక్రవారం విడుదలకాగా.. వివిధ భాషల్లో టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే ఇప్పటివరకూ రూ. 59 కోట్లు వసూలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లలో కొద్ది రోజులుగా బలపడుతూ వస్తున్న మల్టీప్లెక్స్‌ చెయిన్‌ కౌంటర్లకు మరోసారి డిమాండ్‌ పెరిగింది. వెరసి లిస్టెడ్‌ కంపెనీలు పీవీఆర్‌ లిమిటెడ్, ఐనాక్స్‌ లీజర్‌ షేర్లు రెండేళ్ల గరిష్టాలకు చేరాయి. స్టార్‌ హీరోలు రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సినీ పరిశ్రమకు మరింత జోష్‌నివ్వనున్నట్లు సినిమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై పలు భాషల్లో మరింత కంటెంట్‌కు వీలుండటంతో మల్టీప్లెక్స్‌ కౌంటర్ల హవా కొనసాగవచ్చని స్టాక్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

షేర్ల జోరు 
ఎన్‌ఎస్‌ఈలో పీవీఆర్‌ లిమిటెడ్‌ షేరు ఒక దశలో 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 1,868ను తాకింది. ఇది 25 నెలల గరిష్టంకాగా.. చివరికి రూ. 1.6 శాతం బలపడి రూ. 1,804 వద్ద ముగిసింది. ఈ బాటలో ఐనాక్స్‌ లీజర్‌ 12 శాతంపైగా దూసుకెళ్లి దాదాపు రూ. 497కు చేరింది. వెరసి 25 నెలల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6.2 శాతం లాభంతో రూ. 470 వద్ద నిలిచింది. ఇంతక్రితం 2020 ఫిబ్రవరి చివరి వారంలో పీవీఆర్, ఐనాక్స్‌ కౌంటర్లు ఈ స్థాయిలో ట్రేడయినట్లు స్టాక్‌ నిపుణులు తెలియజేశారు.  

తగ్గేదేలే.. 
మల్టీప్లెక్స్‌ రంగానికి తిరిగి మంచి రోజులురానున్నట్లు ఎడిల్‌వీజ్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టర్ల నోట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా సినిమాలు తిరిగి ప్రారంభంకానుండటంతోపాటు.. పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి సీటింగ్‌ సామర్థ్యాలకు అనుమతిస్తున్నట్లు తెలియజేసింది. ఇటీవల మల్టీప్లెక్స్‌ టికెట్‌ ధరలు 14 శాతం పుంజుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించిన పుష్ప తదుపరి దక్షిణాది సినిమాలకు ఆకర్షణ పెరిగినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మరిన్ని పాన్‌ఇండియా మూవీలకు అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement