NCAP: ఇక దేశీయంగా కార్ల క్రాష్‌ టెస్టింగ్‌.. | Sakshi
Sakshi News home page

NCAP: ఇక దేశీయంగా కార్ల క్రాష్‌ టెస్టింగ్‌..

Published Wed, Aug 23 2023 5:24 AM

NCAP: Nitin Gadkari launches Bharat New Car Assessment Programme - Sakshi

న్యూఢిల్లీ: వాహనాలను మరింత సురక్షితం చేసే దిశగా కేంద్రం దేశీయంగా తొలి కార్ల క్రాష్‌ టెస్టింగ్‌ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం (భారత్‌ ఎన్‌క్యాప్‌)ను ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. విదేశాలతో పోలిస్తే చౌకగా దేశీయంగానే కార్ల క్రాష్‌ టెస్టింగ్‌ను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని గడ్కరీ చెప్పారు.

‘విదేశాల్లో ఈ పరీక్షలు చేయించాలంటే దాదాపు రూ. 2.5 కోట్లవుతుంది. అదే భారత్‌ ఎన్‌క్యాప్‌ కింద చేస్తే సుమారు రూ. 60 లక్షలవుతుంది. కాబట్టి దీనికి మంచి మార్కెట్‌ కూడా ఉండగలదు‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం కింద కార్ల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా తమ వాహనాలను పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టుల్లో వాహనాల పనితీరును బట్టి 0–5 వరకు స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. ఈ విధానం కింద 30 పైగా మోడల్స్‌ను టెస్ట్‌ చేయించుకునేందుకు పలు కంపెనీలు సంప్రదించినట్లు గడ్కరీ తెలిపారు. 

Advertisement
Advertisement