ప్రస్తుత జాబ్‌లోనే కొనసాగుతాం | Sakshi
Sakshi News home page

ప్రస్తుత జాబ్‌లోనే కొనసాగుతాం

Published Wed, Apr 19 2023 4:59 AM

Nearly half of employees donot plan to switch jobs in 2023 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలతోపాటు ఉద్యోగార్ధులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ నివేదిక ప్రకారం.. ఇంటర్వ్యూలో పాల్గొన్న 47 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో ఉద్యోగాలు మారడానికి ఇష్టపడడం లేదు. అంటే తాము పనిచేస్తున్న సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించారన్న మాట. 37 శాతం మంది 2023లో తమ కెరీర్‌ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.

కంపెనీలు ఇప్పుడు ఈ నిపుణులను నిలుపుకోవడానికి, ఆకర్షిస్తూ ఉండే మార్గాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. వాల్యూవాక్స్‌ 2023 జనవరి–ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో వివిధ రంగాలకు చెందిన 1,157 కంపెనీలు, 1,583 ఉద్యోగార్థులు పాలుపంచుకున్నారు. ‘బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), హెల్త్‌కేర్‌ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి.

ఈ విభాగాల్లో బలమైన భవిష్యత్‌ కనిపిస్తోంది. బీఎఫ్‌ఎస్‌ఐలో 71 శాతం, ఆరోగ్య సేవల్లో 64, నిర్మాణం, రియల్టీ 57, మీడియా, వినోదం 49, తయారీ 39, ఐటీ, ఐటీఈఎస్‌ 29 శాతం కంపెనీలు కొత్త వారిని చేర్చుకుంటున్నాయి. కొత్తగా జాబ్‌ మార్కెట్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య అక్టోబర్‌–డిసెంబర్‌తో పోలిస్తే 16 నుంచి 23 శాతానికి ఎగబాకింది. తాత్కాలిక ఉద్యోగులను పెద్దగా ఆమోదించడం కూడా ఈ ఏడాది జాబ్‌ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు’ అని నివేదిక వివరించింది.

Advertisement
Advertisement