Sakshi News home page

భారీగా పెరిగిన జీవిత బీమా పాలసీల ప్రీమియం వసూళ్లు: ఐఆర్‌డీఐఏ

Published Sun, Dec 12 2021 4:19 PM

New premium income of life insurers up 42 per cent in November: IRDAI - Sakshi

జీవిత బీమా పాలసీల తొలి ప్రీమియం వసూళ్లు నవంబరులో 42 శాతం మేరకు పెరిగాయి. జీవిత బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది నవంబర్ నెలలో దాదాపు 42 శాతం పెరిగి రూ.27,177.26 కోట్లకు చేరుకుందని ఐఆర్‌డీఐఏ డేటా వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు కలిపి రూ.19,159.30 కోట్ల మేరకు బీమా ప్రీమియాన్ని ఆర్జించాయి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఐఏ) వెల్లడించిన డేటా ప్రకారం.. భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ప్రీమియం వసూళ్లు 32 శాతానికి పైగా పెరిగి మొత్తం రూ.15,967.51 కోట్లను వసూలు చేసింది.  

ప్రైవేట్ రంగానికి చెందిన మిగతా 23 సంస్థలూ కలిపి 58.63శాతం వృద్ధితో రూ.11,209.75 కోట్లను వసూలు చేశాయి. గత ఏడాది క్రితం ఈ ప్రీమియం వసూళ్లు రూ.7,066.64 కోట్లు. క్యుమిలేటివ్ ప్రాతిపదికన ఏప్రిల్-నవంబర్ కాలంలో అన్ని బీమా కంపెనీల ప్రీమియం ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే నుంచి 8.46శాతం పెరిగి, రూ.1,80,765 కోట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఎల్ఐసీ మొదటి ఏడాది ప్రీమియం వాటా 0.93 శాతం తగ్గి రూ.1,14,580.89 కోట్లకు పడిపోయింది. మిగత ప్రైవేటు బీమా సంస్థలు ఈ ఎనిమిది నెలల కాలంలో 30 శాతం వృద్ధితో రూ.66,184.52 కోట్లు వసూలు చేశాయి. మార్కెట్ ఆధిపత్యం పరంగా ఎల్ఐసీ అత్యధిక వాటాను 63.39 శాతంగా కలిగి ఉంది. ఆ తర్వాత ఎస్‌బీఐ లైఫ్‌ 8.77, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 7.86%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 4.91%, మ్యాక్స్‌ లైఫ్‌ 2.36%, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ 2.62% మార్కెట్‌ వాటా సాధించాయి.
(చదవండి: స్టాక్ మార్కెట్‌లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు!)

Advertisement
Advertisement