రికార్డ్స్‌ రికార్డ్స్‌- తొలిసారి 13,000కు నిఫ్టీ

24 Nov, 2020 09:40 IST|Sakshi

మార్కెట్ల ర్యాలీ బాట- కొత్త గరిష్టాలకు సెన్సెక్స్‌, నిఫ్టీ

320 పాయింట్లు అప్‌- 44,397కు చేరిన సెన్సెక్స్‌

95 పాయింట్లు బలపడి 13,021ను తాకిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం అప్‌

ముంబై, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. వెరసి నిఫ్టీ.. మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక సెన్సెక్స్‌ సైతం  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 44,421 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 320 పాయింట్లు ఎగసి 44,397 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 13,021 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 13,027 వరకూ జంప్‌చేసింది. కోవిడ్‌-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

బ్యాంక్స్‌ భేష్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, రియల్టీ 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌ 3.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా అదికూడా 0.5-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఇన్‌ఫ్రాటెల్‌ జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఇన్‌ఫ్రాటెల్‌ 8 శాతం జంప్‌చేయగా.. మైండ్‌ట్రీ, జీఎంఆర్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, అపోలో టైర్‌, ఐడియా, టాటా కెమికల్స్‌ 3-2 శాతం మధ్య బలపడ్డ్డాయి. అయితే మరోపక్క ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, బీహెచ్‌ఈఎల్, టీవీఎస్‌ మోటార్, యూబీఎల్‌, కేడిలా హెల్త్‌, ఎన్‌ఎండీసీ, సన్‌ టీవీ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.8 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,255 లాభపడగా.. 526 నష్టాలతో ట్రేడవుతున్నాయి.   

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు