Netflix Alert: మీకు నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ ఉందా? | Sakshi
Sakshi News home page

Netflix Alert: మీకు నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ ఉందా?

Published Mon, Dec 12 2022 9:16 PM

Pakistani Hacker Leaked Indian Aadhar, Pan Card,netflix,passport On Dark Web - Sakshi

అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మారిన డార్క్ వెబ్‌లో భారతీయుల వినియోగించే అమెజాన్‌ ఓటీటీ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాటు ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఐడీ కార్డులను విచ్చల విడిగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అనుమానిత పాకిస్తాన్‌ హ్యాకర్‌ దాదాపు 5 వేల మంది భారత పౌరుల డేటాను డార్క్‌ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం.    

పలు నివేదికల ప్రకారం.. హ్యాకర్‌ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానెల్‌లలో భారత పౌరుల ఐడెంటిటి కార్డులను  విక్రయించడమే కాకుండా ఫోరమ్‌లలోని సమాచారాన్ని బహిరంగంగా లీక్ చేశాడు. దీంతో వేలాది భారతీయులు సైబర్‌ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు తెలిపాయి. 
 
నిందితుడు డార్క్ వెబ్‌లోని పాకిస్తాన్‌ ఫోరమ్‌లో దేశీయ సమాచారాన్ని షేర్‌ చేశాడు. డేటాను అమ్మేందుకు కొనుగోలు దారులతో ఉర్దూలో సంభాషించాడని, సదరు నేరస్తుడి ప్రొఫైల్‌లో పాకిస్తాన్ జెండా ఉందని ఇంటెలిజెన్స్‌ నిపుణులు గుర్తించారు. ఆ హ్యాకర్‌ తీరును రోజుల తరబడి ట్రాక్‌ చేసిన తర్వాత భారత్‌కు చెందిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థల డేటా సైతం సేకరించినట్లు తేలింది. ఈ లీక్ గురించి హ్యాకర్‌ సీఈఆర్టీ -ఇన్‌, యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్‌ను కూడా హెచ్చరించినట్లు వెల్లడైంది. 

డేటాను సేకరించిన హ్యాకర్‌ డార్క్‌ వెబ్‌లో అదనంగా 4వేల ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు,డ్రైవింగ్ లైసెన్స్‌లు బహిరంగంగా లీక్ అయినట్లు నివేదిక సూచిస్తుంది. అదే వ్యక్తి పాస్‌వర్డ్‌లతో సహా పెద్ద సంఖ్యలో నెట్‌ఫ్లిక్స్ ఖాతా వివరాలను, అంతర్జాతీయ గుర్తింపు పత్రాలను కూడా ఈ డార్క్‌ వెబ్‌లో షేర్‌ చేసిన  దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement
Advertisement