రయ్‌మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు!

10 Sep, 2022 08:37 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనాల హోల్‌సేల్‌ అమ్మకాలు ఆగస్ట్‌లో 18,77,072 యూనిట్లు నమోదయ్యాయి. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, పండుగల సీజన్‌ కోసం డీలర్లు సిద్ధమవడం కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది.

ప్యాసింజర్‌ వాహనాలు 21 శాతం దూసుకెళ్లి 2,81,210 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 16 శాతం ఎగసి 15,57,429 యూనిట్లకు చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్స్‌ 23 శాతం పెరిగి 10,16,794 యూనిట్లు, స్కూటర్స్‌ 10 శాతం అధికమై 5,04,146 యూనిట్లకు ఎగశాయి. త్రిచక్ర వాహనాలు 63 శాతం దూసుకెళ్లి 38,369 యూనిట్లకు పెరిగాయి. 

రుతుపవనాలు మెరుగ్గా ఉండడం, రాబోయే పండుగల సీజన్‌తో వాహనాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. పరిశ్రమకు సీఎన్‌జీ ధర సవాల్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు.    

మరిన్ని వార్తలు