Private equity and venture capital funds investments declined - Sakshi
Sakshi News home page

భారత కంపెనీల్లో తగ్గిన పీఈ పెట్టుబడులు

Published Fri, Jul 21 2023 1:05 AM

Private equity and venture capital funds investments declined  - Sakshi

ముంబై: భారత కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు (పీఈ, వీసీ) ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో 23 శాతం మేర తగ్గి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) 27.5 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. విలువ పరంగా చూస్తే గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలోని పెట్టుబడులు 20.6 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాది తొలి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడులు 35.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను పరిశ్రమ మండలి అయిన ఇండియన్‌ వెంచర్‌ అండ్‌ ఆల్టర్నేటివ్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌ (ఏవీసీఏ), కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా విడుదల చేశాయి.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడుల లావాదేవీలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు సంఖ్యా పరంగా 44 శాతం తగ్గాయి. మొత్తం 427 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తంమీద పీఈ, వీసీ పెట్టుబడుల ధోరణి సానుకూలంగానే ఉందని, ముఖ్యంగా స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు ఈవై పార్ట్‌నర్‌ వివేక్‌ సోని తెలిపారు. పీఈ, వీసీ సంస్థలు ఈ ఏడాది ఆరు నెలల్లో 10.2 బిలియన్‌ డాలర్లను సమీకరించాయి. ఇది రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని ఈ నివేదిక తెలిపింది. నెలవారీగా చూస్తే పీఈ, వీసీ పెట్టుబడుల విలువ జూన్‌లో 3.1 బిలియన్‌ డాలర్లుగా ఉందని, మే నెలతో పోలిస్తే 9 శాతం తక్కువని పేర్కొంది. 

Advertisement
Advertisement