డిజిటల్‌ సెక్టార్లో భారీ ఉద్యోగాలు! | Sakshi
Sakshi News home page

రాబోయే రోజుల్లో 4.50 లక్షల ఉద్యోగాలు

Published Sat, Dec 18 2021 1:22 PM

Quest Corp : Demand For Digital Skills Surges As Cos Go For Upskilling - Sakshi

ముంబై: జావా, క్లౌడ్, డేటా అనలిటిక్స్, ప్లాట్‌ఫాం టెక్నాలజీల్లాంటి డిజిటల్‌ నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్‌ పెరిగిందని డేటా కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ట్‌ కార్ప్‌ ఒక నివేదికలో వెల్లడించింది. గత త్రైమాసికం నుంచి ఈ ధోరణి గణనీయంగా కనిపిస్తోందని పేర్కొంది. టెక్నాలజీలో ప్రతిభావంతులను దక్కించుకునేందుకు సంస్థల మధ్య అసాధారణ పోటీ నెలకొందని వివరించింది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతున్న పరిస్థితుల్లో.. వివిధ రంగాల కంపెనీలు తమ సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్ధుల దరఖాస్తులు, ఉద్యోగాల ఖాళీలను సరిపోల్చి చూసే తమ అప్లికేషన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలోని డేటా ఆధారంగా క్వెస్ట్‌ కార్ప్‌ దీన్ని రూపొందించింది. జూన్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో ధోరణులను సెప్టెంబర్‌–నవంబర్‌ మధ్య కాలంతో పోల్చి ఈ నివేదికను తయారు చేశారు. 

రిక్రూట్‌మెంట్‌కి డిమాండ్‌
ఈ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు కూడా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తున్నాయి. దీంతో గతంతో పోలిస్తే మరింత భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి. రాజీనామాల ద్వారా పెరిగే ఖాళీల సమస్య తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో  రిక్రూట్‌మెంట్‌ సంస్థలకు డిమాండ్‌ పెరుగుతోంది. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అన్‌ఎర్త్‌ఇన్‌సైట్‌ ప్రకారం దేశీ ఐటీ సర్వీసుల పరిశ్రమకి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో స్థూలంగా 4,50,000 మంది పైచిలుకు సిబ్బంది జతకానున్నట్లు క్వెస్ట్‌ కార్ప్‌ తెలిపింది. 

డిజిటల్‌ డీల్స్‌ ఊతం.. 
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో డిజిటల్‌ నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్‌ పెరిగింది. టాప్‌ 5 టెక్నాలజీల్లో ఎప్పట్లాగే జావా కొనసాగుతుండగా .. క్లౌడ్‌ ఇన్‌ఫ్రా, డేటా అనలిటిక్స్‌ నిపుణులకు డిమాండ్‌ భారీగా నెలకొంది. డిజిటల్‌కు మారేందుకు సంస్థలు భారీ స్థాయిలో డీల్స్‌ కుదు ర్చుకుంటూ ఉండటం, హైబ్రిడ్‌ క్లౌడ్‌ వినియోగం మొదలైనవి 2021 ఆఖర్లో వ్యాపారాల పనితీరు మెరుగుపడేందుకు, నియామకాలు పెరిగేందుకు దోహదపడ్డాయని క్వెస్ట్‌ కార్ప్‌ పేర్కొంది.  

చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!

Advertisement

తప్పక చదవండి

Advertisement